వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం పరిహారం అందించడంలోనూ పార్టీలను చూస్తారా? అని ప్రశ్నించారు. ఉభయగోదావరి జిల్లాల తెదేపా నాయకులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... వరద బాధితులను ఆదుకోవటంతో వైకాపా ప్రభుత్వ విఫలమైందని మండిపడ్డారు. అటు కరోనా, ఇటు వరదలు, మరోవైపు వైకాపా నిర్లక్ష్యంతో ప్రజలకు కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
"నీటి నిర్వహణలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర జలసంఘం హెచ్చరికలను బేఖాతరు చేసింది. బాధితుల్లో రాజకీయాలు చూడటం ఎక్కడైనా ఉందా?. తిత్లి తుపాను సమయంలో రోజుకు 1,35,650 మంది నిరాశ్రయులకు భోజనాలు పెట్టాం. 10 రోజుల్లో 13 లక్షల మందికి భోజనాలు వండించి అందజేశాం. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో ఆ స్ఫూర్తి కొరవడటం బాధాకరమం. పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలా ఆదుకోవాలి. 100 శాతం సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేయాలి. వరద బాధితులను ఆదుకున్న తెదేపా నాయకులకు అభినందనలు. ప్రతి విపత్తులోనూ మానవతా దృక్పథంతో తెదేపా ప్రభుత్వం ఆదుకుంది. వైకాపా నోటి మాటలే తప్ప... చేతలతో ఆదుకుంది లేదు" అని చంద్రబాబు అన్నారు.
ఇదీ చదవండి: