పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగనున్న నేపథ్యంలో సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఐజీ మోహనరావులతో చర్చించి పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూం భద్రతను అడిగి తెలుసుకొన్నారు. ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
మొత్తం 50 డివిజన్లకు మూడు ఏకగ్రీవమయ్యాయి. వైకాపా అభ్యర్థులు వీటిని కైవసం చేసుకున్నారు. మిగిలిన డివిజన్లకు మార్చి 10న జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 170 మంది బరిలో నిలిచారు. లెక్కింపు అదే నెల 14న జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశంతో నిలిపివేశారు.
నాలుగు నెలలుగా ఉత్కంఠ
ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, జాబితా సక్రమంగా లేదని పలు రాజకీయ పార్టీల నాయకులు, కొన్ని ప్రజా సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో విలీనం చేసిన ఏడు పంచాయతీల ఓటర్లను 50 డివిజన్లలో కూర్పు చేయగా.. చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయని.. ఓ ప్రాంతంలో ఉన్న ఓట్లను సంబంధం లేని ఇతర ప్రాంతాల్లో చేర్చారని, జాబితాను మార్పు చేయాలని అప్పటివరకు ఎన్నికలు నిలుపుదల చేయాలని కోరారు. దీంతో మార్చి 10న జరగాల్సిన ఎన్నికలను నిలుపుదల చేయాలని న్యాయస్థానం అదే నెల 8న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేయడంతో ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. కానీ లెక్కింపును నిలుపుదల చేయాలని మార్చి 23న దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో లెక్కింపు వాయిదా పడింది.
ఇదీ చదవండి: