తల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరపకుండా ఐదురోజుల పాటు ఇంట్లోనే ఉంచాడు తనయుడు. అలాగే ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా అడ్డుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులు కలగజేసుకొని పురపాలక సిబ్బంది సాయంతో భౌతిక కాయాన్ని తరలించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.
జంగారెడ్డిగూడెంలోని ఓ అపార్ట్మెంట్లో మంజులాదేవి(79) మతిస్థిమితం లేని తన కొడుకు రవీంద్ర ఫణితో నివసిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లో తల్లి మృతదేహం దగ్గరే గడిపాడు రవీంద్ర. దుర్వాసన వస్తుండటంతో ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి స్థానికులు ప్రయత్నించగా అతను అడ్డుకున్నాడు. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకోగా... తన తల్లిని తీసుకెళ్లడానికి వీల్లేదంటూ అతను అడ్డుపడ్డాడు. చివరికి మున్సిపల్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు పోలీసులు. రవీంద్రకు మతిస్థిమితం లేకనే ఇలా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. గతంలో తన సోదరి మరణించిన సమయంలోనూ రవీంద్ర ఇదే విధంగా మృతదేహాన్ని కొన్నిరోజుల పాటు ఇంట్లోనే ఉంచాడని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి
రామతీర్థం ఘటన నిందితులను మూడురోజుల్లో పట్టుకుంటాం: వెల్లంపల్లి