విజయనగరం జిల్లా తారకరామ రిజర్వాయర్ పరిసర గ్రామమైన సారిపల్లిని భూ నిర్వాసిత చట్టం పరిధిలోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం నిమిత్తం భూసేకరణ చేసిన కోరాడపేట, తోటాడపేట, ఏటీ అగ్రహారం గ్రామాల మాదిరిగానే సమీపంలో ఉన్న సారిపల్లి గ్రామానికి అన్ని ప్రయోజనాలు కల్పించేందుకు.. ఆర్ అండ్ ఆర్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.
తారకరామ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలపై సమీక్షించేందుకు కలెక్టర్ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సారిపల్లి గ్రామాన్ని ఆర్అండ్ఆర్ పరిధిలోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని.. అక్కడ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు. అక్కడున్న మొత్తం 1400 కుటుంబాలకు గతంలో చేసిన సర్వే లెక్కల ఆధారంగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నివాస స్థలాలు ఇచ్చే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
సారిపల్లిలో ప్రస్తుతమున్న తాజా పరిస్థితిపై నివేదిక అందజేయాలని జేసీ కిషోర్ కుమార్, ఆర్డీవో భవానీ శంకర్లను ఆదేశించారు. ప్రభావితం అయ్యే రిజర్వాయర్ పరిధిలోని కోరాడపేట, తోటాడపేట, ఏటీ. అగ్రహారం ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సారిపల్లి గ్రామం ప్రాజెక్ట్ పరిధిలోకి రానప్పటికీ అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై, పరిశీలన చేసి పీఏఎఫ్ జాబితా పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత కమిటీ ఇచ్చిన నివేదికను పునఃపరిశీలన చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే పునరావాస చట్టం 2005 ప్రకారం కాకుండా 2013 చట్టం ప్రకారం ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పగా.. వీలుంటే తప్పకుండా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదులిచ్చారు.
ఇవీ చదవండి..