Villagers Dharna Aganist Wine Shop: విజయనగరం జిల్లా రాజాం మండలం రాజయ్యపేట గ్రామ పంచాయతి మెయిన్ రోడ్డులో ప్రభుత్వ మద్యం దుకాణం వద్దంటూ పెద్ద ఎత్తున యువత, మహిళలు నిరసన వ్యక్తం చేసారు. గ్రామంలోని మెయిన్ రోడ్డు వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ రఘుమండల గణపతి నాయుడు, ఎంపీటీసీ సామంతుల సత్యవతి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
గ్రామ సచివాలయం పక్కనే.. ఈ మధ్య దుకాణం ఏర్పాటు చేయడంపై గ్రామ సర్పంచ్ రఘు మండల గణపతి నాయుడు అధికారుల తీరుపై మండిపడ్డారు. దీనికి తోడు.. సచివాలయానికి దగ్గరలోనే స్కూల్ కూడా ఉండటంతో.. సచివాలయానికి వచ్చే ప్రజలు, మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడతారని తెలిపారు. స్కూల్‌కి దగ్గరలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే.. ఇది విద్యార్థులపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదే విధంగా.. ఈ మద్యం దుకాణం గ్రామానికి ప్రారంభంలోనే ఉండటంతో ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే.. గ్రామంలోకి వెళ్లాలంటే మొదటగా కనిపించేది.. ఈ మద్యం దుకాణమే అని అంటున్నారు. దీని వలన గ్రామంలోకి వచ్చే వారిని.. కొంతమంది మద్యం సేవించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వలన మహిళలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విజయనగరం కలెక్టర్‌ని, శ్రీకాకుళం ఐఎమ్ఎల్ డిపో మేనేజర్ని కూడా కలిసి లెటర్ ఇవ్వడం జరిగిందన్నారు. మద్యం షాపును ఆపకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ఇప్పటికైనా అధికారులు మద్యం దుకాణం ఏర్పాటును నిలుపుదల చేయాలని గ్రామస్తులు కోరారు.
"మా సెంటర్లో కొత్తగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నారు. మేము దీనిని వ్యతిరేకిస్తున్నాం. దీని వలన ప్రజలు, మహిళలు, విద్యార్థులు, యువత ఎక్కువగా ఇబ్బంది పడతారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న మద్యం షాపుకు పక్కనే గ్రామ సచివాలయం కూడా ఉంది. ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా.. మద్యం షాపును కట్టడానికి కొంతమంది సిద్ధపడుతున్నారు. ఈ విషయం ఇప్పటికే విజయనగరం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్లాం. ఈ మద్యం షాపు విషయం ఇక్కడితో ఆగకపోతే.. మేమంతా కలసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని అధికారులు.. ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి.. మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా చేస్తారని కోరుకుంటున్నాను". - రఘుమండల గణపతి నాయుడు, సర్పంచ్
ఇవీ చదవండి: