జిల్లాలో కోటి మొక్కలను పెంచడమే లక్ష్యంగా పని చేయడానికి పర్యావరణ ప్రేమికులంతా కలసి రావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామితో కలసి సామాజిక వనాల పెంపకంపై పలు స్వచ్చంద సంస్థలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్ని మొక్కలు నాటామనేది విషయం కాదనీ, ఎన్నింటిని బతికించామనేది ప్రధానమన్నారు. వేసే ప్రతి మొక్క బతికేలా చూడాలని అన్నారు. ఏ మొక్క ఎక్కడ, ఎప్పుడు ఎలా నాటాలనే దానిపై ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. మొక్కలు నాటే ప్రతి ప్రాంతానికి ఒక అధికారికి బాధ్యత అప్పగిస్తామని తెలిపారు.
మొక్కల ప్రేమికులను గుర్తించి పచ్చదనం పెంచడంలో వారి సహకారం తీసుకుంటామని చెప్పారు. రెండేళ్లలో పెంచిన మొక్కల వలన జిల్లాలో వచ్చిన వాతావరణ మార్పులను గమనించాలని కోరారు. ఈ ఏడాది మొక్కలకు అనువైన ప్రాంతాలను గుర్తించి అన్ని చోట్లా పెంచాలని సూచించారు. ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణలో మొక్కలు తప్పకుండా నాటేలా ఆయా శాఖలు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కువ మొక్కలు నాటి, సంరక్షించిన వారికి అవార్డులను ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి కంచె వేయించాలన్నారు. గ్రామ స్థాయిలో సమర్ధవంతమైన సచివాలయ వ్యవస్థ ఉందనీ, వారి సహకారాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ప్రజలకు చెప్పాల్సిన అధికారే... ఉల్లంఘిస్తున్నాడు!'