ఏడు నెలల కిందట ఐటీడీఏ అధికారులు విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధిలోని ఎనిమిది మండలాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణులకు, వారి భర్తలకు ఇలా సుమారు 27, 458 మందికి పరీక్షలు చేయగా 83 మందికి సికిల్ సెల్ ఎనీమియా, ఆరుగురికి తలసీమియా ఉన్నట్లు తేలింది. మరో 628 మంది ఇప్పుడిప్పుడే దీని బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఇందులో ఐదేళ్లలోపు చిన్నారులు, విద్యార్థులు 486 మంది, గర్భిణులు 150 మంది, వారి భర్తలు 46 మంది, 16 నుంచి 21 ఏళ్ల లోపు వారు 35 మంది ఉన్నారు. వీరందరినీ పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన వారికి రక్తం ఎక్కించడం, మిగతా వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ అప్రమత్తం చేస్తున్నారు.
సికిల్ సెల్ ఎనీమియా, తలసీమియా ఈ రెండు వ్యాధులనూ అదుపు చేసుకోవడమే తప్ప మందు లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. తరచూ రక్త పరీక్షలు చేస్తూ.. అవసరమైనవారికి మల్టీ విటమిన్, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మందులతో కొంత ఉపశమనం ఉంటుందని చెబుతున్నారు. త్వరగా అలసిపోవడం, బరువు తగ్గడం, దాహం ఎక్కువ కావడం, చిన్నపిల్లలైతే సరిగా తినకపోవడం, వాంతులు, కడుపు నొప్పి, తరచూ జ్వరం రావడం వంటి లక్షణాలు వీరిలో ఉంటాయి. తలసీమియా బాధితులు మలేరియా బారిన పడే ప్రభావం ఎక్కువని వైద్యులు అంటున్నారు.
సికిల్ సెల్ ఎనీమియా, తలసీమియా జన్యుపరమైన వ్యాధులని చెబుతున్నారు వైద్యులు. గిరిజనుల్లో మేనరికాలు, ఒకే ఊరిలో సంబంధాలు కలుపుకోవడం వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని భావిస్తున్నారు. మైదాన ప్రాంతంలో కంటే కొండలపై ఉన్న వారిలోనే ఎక్కువమంది దీని బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఎత్తులో ఉండటం వల్ల రక్త కణాలు కుచించుకుపోయి హిమోగ్లోబిన్లో తేడా వస్తుందని గుర్తించారు. పాచిపెంట, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నారు. పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 17 మంది గర్భిణులు సికిల్ సెల్ ఎనీమియా బారిన పడినట్లు గుర్తించారు.
ఈ వ్యాధిగ్రస్తులు గతంలో రక్తం ఎక్కించుకోవడానికి విశాఖపట్నంలోని కేజీహెచ్ కు వెళ్లేవారు. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడంతో ఫిబ్రవరిలో ఐటీడీఏ ఆధ్వర్యంలోనే పార్వతీపురంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో డేకేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ రెండు వ్యాధులకు చికిత్స అందించడానికి సదుపాయాలు కల్పించారు. ఉచితంగా రక్తం అందిస్తున్నారు. గర్భిణులు రాలేని పరిస్థితుల్లో ఉంటే వాహనం పంపిస్తారు. బాధితులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులను ఆస్పత్రిలోని పౌష్టికాహార కేంద్రంలో ఉంచుతున్నారు. బాధితుల పేరుతో ఒక్కో నోటు పుస్తకం పెట్టి అందులో వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఒకవేళ సమయానికి కేంద్రానికి రాకపోతే స్థానిక పీహెచ్సీ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. పింఛనుకు అవసరమైన పత్రాలు కూడా సిద్ధం చేసి సంబంధిత అధికారులకు పంపిస్తున్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని గిరిజనులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి : తెగిన వంతెన.. వెదురు కర్రె వారధిగా...