వేసవి సెలవుల్లో జూన్ 7 వరకు చిన్నారులకు ఆటపాటలతో వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నాయి గ్రంథాలయాలు. జిల్లా కేంద్ర గ్రంథాలయాలు, శాఖ గ్రంథాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. చిత్రలేఖనం, పుస్తక పఠనం, వక్తృత్వంపై తర్ఫీదునిస్తున్నారు. ఆటపాటలతో విజ్ఞానం పెంపొందిస్తున్నారు. సృజనాత్మకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పుస్తక పఠనం అలవర్చే చర్యలు తీసుకుంటున్నారు. వేసవి సెలవులకు ముందే శాఖ గ్రంథాలయాల అధికారులు పాఠశాలలు సందర్శించి శిక్షణా శిబిరాలపై అవగాహన కల్పించారు. విద్యార్ధులు పాల్గొనేలా చర్యలు చేపట్టారు.
వివిధ రంగాల్లో శిక్షణ
రోజూ ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు పుస్తక పఠనం, 11గంటల వరకు కథలు చెప్పటం, మధ్యాహ్నం 12గంటల వరకు ఆంగ్లంలో మాట్లాడిస్తున్నారు. తర్వాత చిత్రలేఖనం, కాగితాలతో వస్తువులు, సంగీతం, నృత్యం, అతిథులతో ఉపన్యాసాలు, సరదాగా కబుర్లు చెప్పటం వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. పాల్గొంటున్న వారికి మజ్జిగ, బిస్కెట్లు అందిస్తున్నారు. తర్ఫీదు పొందుతున్న పిల్లలకు ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నారు. మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్ధులను జిల్లాస్థాయికి ఎంపిక చేస్తున్నారు. గెలుపొందిన వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందచేస్తున్నారు.