Medical College in Vijayanagaram : విజయనగరం జిల్లాలో కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు పడటం, నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 70ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ కళాశాల నిర్మాణ పనులను రానున్న ఏడాదికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. రానున్న విద్యా సంవత్సరం నుంచి విజయనగరంలో మొదటి సంవత్సరం వైద్యవిద్య తరగతుల ప్రారంభానికి సైతం జాతీయ వైద్య మండలి అనుమతించింది. రాష్ట్రంలో కొత్తగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎన్ఎంసీ కి దరఖాస్తు చేయగా.., విజయనగరం వైద్య కళాశాల మాత్రమే ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించేందుకు ఎన్ఎంసీ అనుమతి పొందటం గమనార్హం.
43 ఏళ్లకు నెరవేరిన కల.. విజయనగరం జిల్లా ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ, వైద్య పరంగా ఇప్పటికీ పక్కనున్న జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే.., విజయనగరం మహారాజ వంశీయుల్లో ఒకరైన పూసపాటి ఆనంద గజపతిరాజు వైద్య కళాశాల ఏర్పాటుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కళాశాల నిర్మించడానికి ప్రభుత్వం ముందుకొస్తే అవసరమైన సహకారం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ, ఆయన కల నెరవేరలేదు. రూ.300కోట్లతో వైద్య కళాశాల నిర్మించాలని అప్పట్లో కేంద్రం నిర్ణయించినా.., నగరానికి నిమ్స్ తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ఉండటంతో వెనక్కి తగ్గారు. కళాశాల ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం సంకల్పించినా ఆచరణలో సాధ్యపడలేదు.
500 కోట్ల రూపాయలు కేటాయింపు... రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరం మే 31న విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులకు శిలాఫలకం వేసింది. గతేడాది మార్చి 22న జీఓ నంబర్ 33 ద్వారా జిల్లాకు వైద్య కళాశాల మంజూరుతో పాటు నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించింది. ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమీపంలోని గాజులరేగ వద్ద 70 ఎకరాల విస్తీర్ణంలో 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇక్కడ సుమారు 500 పడకలతో ఆసుపత్రి భవనాలు, కళాశాల భవనం, సర్వీస్ బ్లాక్, మొదటి, రెండో సంవత్సర వైద్య విద్యార్థుల కోసం బాలికలు, బాలురకు వేర్వేరుగా వసతి గృహాలు. బోధనా సిబ్బందికి నివాస గృహాలు, స్టాఫ్ క్వార్టర్స్, నర్సింగ్ కళాశాల, నర్సుల క్వార్టర్స్, ట్రైనీ నర్సుల కోసం బాల, బాలికలకు వేర్వేరుగా వసతిగృహాలు ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా మార్చురీ, బయో మెడికల్ వేస్టేజ్ బ్లాక్, సెక్యూరిటీ బ్లాక్, గెస్ట్ హౌస్, ప్రజలు వేచి ఉండేందుకు ధర్మశాల, అంబులెన్సు షెడ్, డ్రగ్ స్టోర్, కిచెన్ కమ్ డైమింగ్ షెడ్, మెడికల్ 5 ఆక్సిజన్ ప్లాంట్ తదితర నిర్మాణాలను చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో నిర్మాణ పనులను నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ చేస్తోంది. విజయనగరం జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల వరం కానుందని రాజకీయ పక్షాలకు చెందిన జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రానున్న విద్యా సంవత్సరం నుంచి మొదటి ఏడాది వైద్య తరగతులు ప్రారంభం కానున్న దృష్ట్యా రూ.5కోట్ల వ్యయంతో తాత్కాలిక పీఈబీ విధానంలో తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నారు. ఈ పనులు ఇప్పటికే 60శాతం పూర్తయ్యాయి. ఏప్రిల్ ఆఖరికి భవనం అందుబాటులోకి వస్తుంది. శాశ్వత భవనాల పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి.. వచ్చే ఏడాదికి పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. - సత్యప్రభాకర్, డీఎం, ఏపీఎంఎస్ఐడీసీ, విజయనగరం
2023-24 విద్యా సంవత్సరం నుంచి 150ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)సైతం అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రంలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు అనుమతి కోరగా.. వాటిల్లో తరగతులను ప్రారంభించేందుకు అనుమతి పొందిన తొలి వైద్య కళాశాల విజయనగరమే. అన్నీ సజావుగా జరిగి జూన్, జులైలో ప్రవేశాలు పూర్తయితే మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తాం. - పద్మలీల, ప్రధానాచార్యులు, విజయనగరం వైద్య కళాశాల
విజయనగరం జిల్లాలో వైద్య కళాశాల అవసరాన్ని గుర్తు చేస్తూ లోక్ సత్తా తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఇన్నాళ్లకు కళాశాల మంజూరు కావడం శుభపరిణామం. - భీశెట్టి బాబ్జీ, లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నో ఏళ్ల నాటి కల నిజం అవుతోంది. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఙతలు. - మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ, విజయనగరం జిల్లా అధ్యక్షుడు
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా జల్లా కేంద్రాసుపత్రిని ఆధునీకరించారు. సుమారు రూ.8కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించి., వసతులు, 30పడకల ఎన్ఐసీయూ, ఐసీయూ, ఎస్ఐసీయూ సదుపాయాలు కల్పించారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. గర్భిణులు, చిన్నపిల్లల కోసం ఘోష ఆసుపత్రిని ఆధునీకరించి సిద్ధం చేశారు. వీటిల్లో అవసరమైన పర్యవేక్షకులు, ప్రొఫెసర్లు, నిపుణులు, సిబ్బంది నియామకాలను దాదాపు పూర్తి చేశారు.
ఇవి చదవండి :