విజయనగరం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో... విద్యుత్తు అవసరాల కోసం.. సోలార్ విద్యుత్తు ప్లాంట్‌ని 2017లో 4.80 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. జేెెెెఎన్టీవీ కళాశాల పక్కనున్నగుట్టపై.. ఒక మెగావాట్ సామర్య్థంతో నిర్మించారు. అప్పటి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు తన వంతుగా ఎంపీ ల్యాడ్స్ నుంచి కొంత మొత్తాన్ని కేటాయించారు. ద్వారపుడిలో ఏడాదికి 14.40 లక్షల యూనిట్లు సౌరవిద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటైంది. ఈ ప్రాజెక్ట్ నుంచి రోజుకు 4 వేల నుంచి 4,500 యూనిట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తయ్యేది. అయితే., గతేడాది ఆగస్టులో.. ప్లాంట్ లో సంభవించిన విద్యుదాఘాతం కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది.
ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి లేకపోవడం వల్ల అప్పటి నుంచి దానిని అధికారులు పట్టించుకోలేదు. దీంతో నెలకు లక్ష యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యానికి గండిపడింది. 25ఏళ్ల పాటు విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంతో చేపట్టిన సౌర విద్యుత్తు ప్లాంట్ పడకేయటంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర విద్యుత్ కోతలు ఉన్న ఇలాంటి సమయాల్లో ఇది ఎంతో ఉపయోగపడేదని అంటున్నారు.
తెదేపా నేతల ఆగ్రహం: సౌర విద్యుత్తు ప్రాజెక్ట్ ద్వారా నగరపాలక సంస్థకు నెలకు సుమారుగా 4లక్షల రూపాయల వరకు ఆదా అయ్యేది. ఇప్పుడు ఆ ఆదాయానికి గండిపడింది. ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయినప్పటి నుంచి నిర్వహణ లేక.. ప్యానెల్స్ చెల్లాచెదురుగా పడిపోయాయి. రహదారి మార్గం కూడా పిచ్చిమొక్కలతో నిండిపోయింది. సోలార్ ప్లాంట్ మరమ్మతులపై దృష్టి సారించకపోవడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు సోలార్ విద్యుత్తును కార్యాలయ అవసరాల దగ్గర నుంచి నగరంలోని వీధి దీపాలు, తాగునీటి పథకాలకు వరకు ఉపయోగించింది. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్నసోలార్ విద్యుత్తు ప్లాంట్‌ని పట్టించుకోకపోవడంతో.. పర్యావరణ ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: కరెంట్ కష్టాలకు జగన్ విధానాలే కారణం: చంద్రబాబు