పదేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న గిరిజన ప్రాంతంలో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. నెలరోజులుగా మాంగనీసు గనుల తవ్వకాలను వ్యతిరేకిస్తూ గిరిజన, రైతు సంఘాల నాయకులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పర్యావరణ అనుమతులు లేవు కనుక లీజులను రద్దు చేయండని డిమాండు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేత ఒకరు చక్రం తిప్పుతుండటంతో అధికారులు కూడా లీజుదారులకు వత్తాసు పలుకుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజన్నదొర మాత్రం గిరిజనుల అంగీకారం లేకుంటే గనుల తవ్వకాలు చేయొద్దని చెబుతున్నారు. గిరిజనులకు అన్యాయం జరగకుండా స్పష్టమైన ప్రకటన ఎమ్మెల్యే ఇవ్వాలని శిఖపరువు మైనింగ్ పోరాట సంఘ నేతలు కోరుతున్నారు
గిరిజనుల వ్యతిరేకత
శిఖపరువు అన్‌సర్వే భూముల్లో గనుల తవ్వకాలకు 2007, 2008లో ముగ్గురు దరఖాస్తు చేశారు. టి.నాగయ్యకు 9.350 హెక్టార్లు విస్తీర్ణంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ 2009 జూన్ 29న మాంగనీసు తవ్వకాలకు అనుమతులిస్తూ జీవో 161 జారీ చేసింది. పెద్ద తరహా ఖనిజ నియమావళి ప్రకారం 20 ఏళ్ల కాలపరిమితితో డిసెంబరు 23, 2029 వరకు లీజు ఇచ్చారు. అప్పట్లో తవ్వకాలకు లీజుదారులు ఏర్పాట్లు చేసుకున్నారు. పర్యావరణ అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ చేయగా.. గిరిజనులు వ్యతిరేకించారు.
డబ్బులు ఎరజూపి
గిరిజనులను ఒప్పించి, పర్యావరణ అనుమతులు దక్కించుకునేలా అధికార పార్టీకి చెందిన నేత ఒకరు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. గిరిజనులు, స్థానిక పెద్దలకు డబ్బులు ఎరజూపి పంచాయతీ తీర్మానంతో పాటు, ప్రజామోదం పొందేలా రూ.కోట్లాదిగా ఖర్చు చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. గిరిజనులను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు పావులు కదుపుతున్నారని గిరిజన, రైతు సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బదలాయింపు
లీజుదారు తన లీజును వేరే వ్యక్తికి సబ్‌లీజు ఇవ్వడంతో ఆదేశాలు వెలువడ్డాయి. అప్పటి సాలూరు తహసీల్దార్ నిరభ్యంతర పత్రాన్ని ఇచ్చారు. సబ్‌లీజుదారు పర్యావరణ అనుమతికి దరఖాస్తు చేశారు. జనవరి 10, 2018న మళ్లీ కలెక్టర్, సంబంధితశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సి ఉంది.
సంవత్సరాలుగా ఆ భూములే ఆధారం
ఆభూములనే సాగు చేసుకుని సంవత్సరాలుగా జీవిస్తున్నాం. గనులు తవ్వుతామని పోడు భూములు ఖాళీ చేయమంటే మా బతుకులు ఏం కావాలి. ఇళ్లు, భూములు లాక్కుంటామంటే మరో గిరిజన పోరాటం చేయక తప్పదు. - బోడెమ్మ, గిరిజన మహిళ, శిఖపరువు
పోరాటం తీవ్రం
సర్వేకాని భూమి, పీసా చట్టం అమల్లో ఉన్న ప్రాంతంలో గిరిజనేతరులకు గనుల తవ్వకాలకు లీజు ఎలా ఇస్తారు..? ఇది రాజ్యాంగ విరుద్ధం. గతంలో గనుల తవ్వకాలకు ఇచ్చిన లీజులను రద్దు చేయాలి. లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తాం. - ఆర్.శ్రీరామ్మూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి
అనుమతులుండాలి
శిఖపరువులో గనుల తవ్వకాలకు 2009లోనే లీజు ఆదేశాలు వచ్చాయి. పర్యావరణ అనుమతుల్లేవు. చట్టపరంగా అనుమతులు వచ్చాకే గనుల తవ్వకాలు చేపట్టాలి. లేదంటే నేరం. చర్యలు తప్పవు. - విజయలక్ష్మి, ఏడీ,గనులశాఖ, విజయనగరం.
ఇదీ చదవండి: