విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అధికారం అండతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేస్తున్నారని ఆరోపించారు. దొరికిందల్లా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మద్య నిషేధం కోసమే ధరలు పెంచామంటూ డబ్బులు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. లిక్కర్ మాఫియాను పెంచి పోషిస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు.
రాజధాని విషయంలో జగన్ నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. "విశాఖను అభివృద్ధి చేయడం చేతగాక.. మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు.
"ఉత్తరాంధ్ర ప్రాంతం తెలుగుదేశం కంచుకోట కావడం వల్లే... ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారని, విశాఖ భూములను వైసీపీ మూకలు కొల్లగొడుతున్నాయని దుయ్యబట్టారు. చివరికి తహసీల్దారు, కలెక్టరేట్, రైతుబజార్‌నూ తాకట్టు పెట్టేశారని గుర్తుచేశారు.
బీసీలంటే జగన్‌కు చులకన భావం ఉందన్న చంద్రబాబు... వారిని బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. అందుకే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టారని ఆక్షేపించారు. ఎస్సీలనూ మోసగించిన జగన్.. ఆ వర్గానికి సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు.
రాజాం ఆర్సీఎం చర్చిలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. తెలుగుదేశం పాలనలో క్రిస్మస్ కానుకలు ఇస్తే.. వైసీపీ వచ్చాక అన్నీ తీసేసిందన్నారు.
ఇవీ చదవండి:
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన.. వివరాలివే..