విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో లక్ష మొక్కల పెంపకమే లక్ష్యంగా చేసుకొని...జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి మార్గదర్శకంగా నిలబడతామని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. భోగాపురం మండలం కౌలువాడ పంచాయితీలో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా నాటిన మొక్కతో పాటు ఒకేసారి వెయ్యి మొక్కలను నాటి, వాటికి సంరక్షించేందుకు వలలను ఏర్పాటు చేశారు.
భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లోనూ రహదారులకు ఇరువైపులా, గృహ నివాస ఖాళీ స్థలాల్లోనూ ఈ మొక్కలు నాటి భవిష్యత్తులో పర్యావరణాన్ని పెంపొందించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సుందర గోవిందరావు, ఎంపీడీవో బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.