విజయనగరం పురపాలక సంఘం 2017 జులై 9న 4.64 కోట్ల రూపాయలతో సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న తెదేపా నేత అశోక్ గజపతి రాజు తన ఎంపీ లాడ్స్ నిధులు కూడా కేటాయించారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.
ఏడాదికి 14.40 లక్షల యూనిట్లు సౌరవిద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి రోజుకు 4 వేల నుంచి 4,500 యూనిట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తయ్యేది. గతేడాది ఆగస్టులో ప్లాంట్ లో సంభవించిన విద్యుదాఘాతం కారణంగా ఉత్పత్తి నిలిచింది. అప్పటి నుంచి పునరుద్ధరణకు నోచుకోలేదు. పార్టీలతో సంబంధం లేకుండా ప్లాంటును తిరిగి పునరుద్ధరించాలని స్థానిక నేతలు కోరుతున్నారు.
నగరపాలక సంస్థ అధికారులు దీనిపై స్పందిస్తూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్లాంట్ లో 9లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని చెబుతున్నారు. అదేవిధంగా గుత్తేదారు శ్రీసావిత్రి లిమిటెడ్ సంస్థ ప్రతినిధికి 22 లక్షల రూపాయల వరకు బిల్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్లాంట్ మరమ్మతులకు త్వరలో చర్యలు తీకుంటామని తెలిపారు.
సోలార్ విద్యుత్తును కార్యాలయ అవసరాల వినియోగానికే పరిమితమై విజయనగరం నగరపాలక సంస్థ.. నగరంలోని వీధి దీపాలు, తాగునీటి పథకాలకు పూర్తిగా సోలార్ విద్యుత్తునే ఉపయోగించింది. ఇలా.. సోలార్ విద్యుత్తు వాడకంతో విద్యుత్తు బిల్లులను ఆదా చేయటంలోనే కాకుండా.. నగర అవసరాలకు సైతం సోలార్ విద్యుత్తును వాడుతున్న పురపాలక సంఘంగా రాష్ట్రంలోనే మొట్ట మొదటిదిగా నిలిచింది. అయితే.. అధికారుల అలసత్వం కారణంగా సోలార్ విద్యుత్తు ఉత్పత్తి పడకేయటంపై పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: సోమవారం గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్