గిరిజన సహకార సంస్థకు అద్భుత అవకాశం.. ఆదాయ మార్గం.. లభించింది. ఉపాధి హామీ పథకానికి 5.37 లక్షల సబ్బులు సరఫరా చేసే బాధ్యత జీసీసీ దక్కించుకుంది. ఈ మేరకు జాతీయ ఉపాధి హామీ (పంచాయతీ రాజ్) శాఖ నుంచి ఆర్డర్ వచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉపాధి వేతనదారులు పని ప్రదేశంలో చేతులు కడుక్కునేందుకు సబ్బులు పంపిణీ చేసే బాధ్యతను జీసీసీకి అప్పగించింది.
ఇందుకుగాను తొలి విడతగా 86 లక్షల రూపాయలు చెల్లించింది. ఇప్పటికే జీసీసీ అటవీ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా విజయనగరంతో పాటు విశాఖ జిల్లా పాడేరులో సబ్బుల తయారీ యూనిట్ నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ 2 యూనిట్లలో సబ్బుల తయారీ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.
జిల్లాల వారీగా జీసీసీకి వచ్చిన ఆర్డర్లు.....
జిల్లా సబ్బులు
విజయనగరం 86,000
శ్రీకాకుళం 86,000
విశాఖపట్నం 78,000
కృష్ణా 87.800
తూర్పు గోదావరి 77,210
పశ్చిమ గోదావరి 14,000
కడప 60,000
నెల్లూరు 46,000
అనంతపురం 20,000
చిత్తూరు 20,000
గుంటూరు 28,000
ప్రకాశం 35,000
కర్నూలు 24,600
రాష్ట్రంలో ప్రాంతాల వారీగా లభించే ఆటవీ ఉత్పత్తులకు అనుగుణంగా జీసీసీ యూనిట్లు ఏర్పాటు చేసింది. అటు గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించటంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుంది. విజయనగరం, పాడేరులో సబ్బుల తయారీ యూనిట్లను దశాబ్దాల కిందట ఏర్పాటు చేసింది. కలబంద, జాస్మిన్, టర్మరిక్, నీమ్ సబ్బులు తయారు చేస్తోంది. జీసీసీ స్వయంగా రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటుచేసి ఉత్పత్తులను విక్రయిస్తోంది.
పెరుగుతున్న ఆదరణ
ప్రజల్లో కూడా ఇప్పుడిప్పుడే జీసీసీ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులకు సబ్బులు సరఫరా చేస్తోంది. ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతోంది. గత ఏడాది 1.48 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 3 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా అనతికాలంలోనే 2.20 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి వేతనదారుల కోసం భారీస్థాయిలో ఆర్డర్ రావడంతో జీసీసీ అధికారులు సంతోషపడుతున్నారు. ఉపాధి వేతనదారుల ద్వారా ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుందని భావిస్తున్నారు. తద్వారా మార్కెట్ పెంచుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
సబ్బులతోపాటు మరిన్ని ఉత్పత్తులు
జీసీసీ ఉత్పత్తులకు క్రమంగా ప్రజాదరణ పెరుగుతున్నందున యూనిట్ల ఆధునీకరణ, ఇతర ఉత్పత్తుల తయారీపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే., ఆధునిక యంత్రాల ఏర్పాటు పూర్తి కాగా.. సర్ఫ్, ప్లోర్ క్లీనింగ్ రసాయనాల తయారీకి కార్యచరణ రూపొందిస్తున్నారు.