విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీసీతారామస్వామి ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోత్తకంగా జరిగింది. కొన్ని రోజుల క్రితం ఈ ఆలయంలో రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తితిదే రూపొందించిన సీతారామలక్ష్మణుల నూతన విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠించారు. దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు భ్రమరాంబ పర్యవేక్షణలో... శ్రీవెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ నెల 25న తిరుపతి నుంచి రామతీర్థం చేరుకున్న విగ్రహాలకు... మూడు రోజుల పాటు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 25న అంకుర్పారణతో మొదలై.. 26న అగ్నిమథనం, అగ్ని ప్రతిష్ఠలు, పంచగవ్వ దారా అస్త్రం చేపట్టారు. 27న నూతన విగ్రహాలకు అక్షిమోచనం నిర్వహించారు. ఆరు హోమగుండాలు ఏర్పాటు చేసి... క్షీరాదీవాసం, జలాదీవాసం, శయనాదీవాసం జరిపారు. ఇక గురువారం బాలాలయంలో ప్రతిష్ఠకు ముందు పూర్ణ హారతులతో ప్రారంభించి... శాంతిపౌష్టిక పూజలు, నిత్య ఆరాధానాలు చేశారు. అనంతరం ముహూర్తం ప్రకారం ఉదయం 8.56 నిమిషాలకు పూర్ణాహుతితో ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. స్థానికులు భారీ సంఖ్యలో సీతారామలక్ష్మణులను దర్శించుకున్నారు.
బోడికొండపై ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు బాలాలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలకు నిత్య ఆరాధన, కైంకర్యాలను నిర్వహిస్తామని దేవాదాయశాఖ అధికారులు తెలియజేశారు. శాస్త్ర ప్రకారం ఏడాది వరకూ బాలాలయంలో విగ్రహాలను ఉంచవచ్చని... ఈలోగా ఆలయ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
ఇదీ చదవండి