విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ అమ్మవారి జాతర సోమవారం ఘనంగా ప్రారంభమైంది. జాతరలో భాగంగా ముఖ్యఘట్టమైన సిరిమానోత్సవం.. నేడు మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమవనుంది. రేపు అనుపు ఉత్సవం జరగనుంది. జాతర ముగిసిన 10వారాల వరకు కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మార్చి 31వరకు ప్రతి మంగళవారం జాతరోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఆలయాధికారులు తెలిపారు.
వృద్ధులకు, చిన్న పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు
వృద్ధులకు, చిన్న పిల్లలకు.. పాలు, మజ్జిగ ప్యాకెట్ల ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని.. ఆలయ ఈవో ఈవో నగేష్ తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని భక్తులకు సూచించారు.
ఆర్టీసీకి అనుమతి లేదు
జాతర సమయంలో ఈ ప్రాంగణంలో.. ఆర్టీసీ బస్సులు తిరగకుండా కట్టడి చేశారు. బయటి నుంచి వచ్చిన వారికి ద్విచక్ర వాహనాలు, ఆటోలను మాత్రమే అనుమతించినట్లు పార్వతీపురం ఓఎస్డీ సూర్యచందర్రావు తెలిపారు.
పటిష్ట బందోబస్తు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సుమారు 550 మంది పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 104,108 వాహనాలు.. అగ్నిమాపక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినట్లు ఓఎస్డీ తెలిపారు.
ఇదీ చదవండి: విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్