Sexual Harassment Complaint in AU: ఆంధ్ర విశ్వ విద్యాలయంలో హిందీ విభాగాధిపతి ఆచార్య సత్యనారాయణ తన పరిశోధన పత్రం అంశంలో లైంగికంగా వేధించారని ఓ పరిశోధకురాలు మూడు నెలలు క్రితం ఏయూ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన యూనివర్శిటీ ఉపకులపతి, రిజిస్ట్రర్లు విచారణ కమిటీని నియమించారు. ఐతే ఆరోపణలపై మాత్రం ప్రాథమికంగా ఆధారాలు లేవని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు. హిందీ విభాగాధిపతి మాత్రం ఫిర్యాదురాలి భర్త కొంత కాలం ఏయూలో పనిచేశారని.. ఆ సమయంలో వక్రమార్గంలో తన భార్యకు పీహెచ్డీ కోరారని.. అది నిరాకరించినందుకే కక్ష గట్టి తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఇటువంటి ఆరోపణలు, ఫిర్యాదులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో విచారణ అధికారులపై తనకు నమ్మకం లేదని సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
"ఫిర్యాదురాలి భర్త కొంత కాలం ఏయూలో పనిచేశారు. ఆ సమయంలో వక్రమార్గంలో తన భార్యకు పీహెచ్ డి కోరారు. అందుకు నిరాకరించినందుకే కక్ష గట్టి నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఇటువంటి ఆరోపణలు, ఫిర్యాదులకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో విచారణ అధికారులపై నాకు నమ్మకం లేదు. దీన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి." - ఆచార్య సత్యనారాయణ , ఏయూ హిందీ విభాగాధిపతి
ఏయూలో ఓ పరిశోధకురాలు మూడు నెలలు క్రితం హిందీ విభాగాధిపతి సత్యనారాయణపై ఫిర్యాదు చేశారని, ఈ అంశం ఏయూ అంతర్గత ఫిర్యాదు సెల్ దృష్టికి కూడా వచ్చిందని ఏయూ రిజిస్ట్రర్ వి.కృష్ణ మోహన్ తెలిపారు. ఈ ఫిర్యాదుపై ఏయూ క్రమశిక్షణ కమిటీ దర్యాప్తు చేస్తుండగానే ఇరువురు ఒకరిపై మరొకరు బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం దురదుష్టకరమన్నారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఆరోపణలు నిజమని తేలితే అధికారిపై ఏయూ నిబంధనలు మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"ఏయూలో మూడు నెలలు క్రితం ఓ పరిశోధకురాలు.. హిందీ విభాగాధిపతి సత్యనారాయణపై ఫిర్యాదు చేశారు. ఈ అంశం ఏయూ అంతర్గత ఫిర్యాదు సెల్ దృష్టికి కూడా వచ్చింది. ఈ ఫిర్యాదుపై ఏయూ క్రమశిక్షణ కమిటీ దర్యాప్తు చేస్తుండగానే ఇరువురు ఒకరిపై మరొకరు బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం దురదుష్టకరం. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఆరోపణలు నిజమని తేలితే అధికారిపై ఏయూ నిబంధనలు మేరకు చర్యలు తీసుకుంటాం." - ఆచార్య కృష్ణ మోహన్, ఏయూ రిజిస్ట్రర్
అధికారులు వ్యక్తిగత కక్షలతో పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ యూనివర్శిటీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిశోధకురాలు ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాల్ని బయట పెట్టాలని ఆందోళన చేస్తున్నారు.