రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని సవరవిల్లి పంచాయతీ అవ్వపేట జాతీయ రహదారిపై జరిగింది. సవరవిల్లి గ్రామంలో జరుగుతున్న బంగారమ్మతల్లి ఉత్సవానికి డెంకాడ మండలం బంగార్రాజుపేటకు చెందిన కొల్లి వీరబాబు(32), విజయవాడకు చెందిన కె.ఈశ్వరరావు(32) కలిసి వచ్చారు. వీరిద్దరూ వరుసకు బావ, బామ్మర్దులు. ఈశ్వరరావు ప్రస్తుతం తన అత్తారిల్లయిన అవ్వపేటలో ఉంటున్నారు. వీరబాబు వృత్తిరీత్యా సంతలకు వెళ్లి మేకల అమ్మడంతో పాటు, మాంసం వ్యాపారం చేస్తుంటారు.
పండగ నేపథ్యంలో మేకపోతులు కొట్టేందుకు కత్తి కోసమని మంగళవారం రాత్రి ఇద్దరూ ద్విచక్రవాహనంపై బంగార్రాజుపేట బయలుదేరారు. పోలిపల్లి వద్ద వంతెన దాటే క్రమంలో ఎదురుగా నడిచివెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ డివైడర్‌పై ఎగిరిపడి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. నడిచివెళుతున్న వ్యక్తిని తగరపువలస గ్రామానికి చెందిన కోరాడ రమణగా గుర్తించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. క్షతగాత్రుడ్ని ముందుగా విజయనగరం తీసుకెళ్లి అక్కడి నుంచి విశాఖ తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.