విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా జియ్యమ్మవలస మండలం బీజేపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 58 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గ్రామస్థుల సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మీపురానికి చెందిన వ్యాపారి అలమండలో 60 బస్తాల బియ్యం కొనుగోలు చేసి వాహనంలో మిల్లుకు తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భోగాపురం మండలంలో కొన్ని రోజుల కిందట లారీలో తరలిపోతున్న 10 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని పౌరసరఫరాల గోదాముకు తరలించారు. ఇవన్నీ కొన్ని రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న ఘటనలే..
- అక్రమార్కులకు కాసులు
పేదల ఆకలి తీర్చేందుకు రాయితీపై ఇస్తున్న కిలో రూపాయి బియ్యం పక్కదారి పడుతోంది. విజయనగరం జిల్లాలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఈ బియ్యాన్ని రైస్‌మిల్లుల్లో రీసైక్లింగు చేసి మళ్లీ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రూపాయి బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు, దళారులు పేదల వద్ద, డీలర్ల నుంచి రూ.10-రూ.15 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీన్ని జిల్లాలోని పలు రైస్ మిల్లులకు తరలించి, అక్కడ రీసైక్లింగ్ చేసి అదే బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో రూ.35 నుంచి రూ.40 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. కరోనా లాక్‌డైన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు చౌకధరల దుకాణాలు ద్వారా అందించే రాయితీ బియ్యాన్ని అదనంగా మంజూరు చేశాయి. నెలలో ఒకేసారి ఇచ్చే కోటాను.. రెండుసార్లు చేశారు.
లాక్‌డౌన్ దగ్గర నుంచి ఐదు విడతల ఉచిత రేషన్‌ను కార్డుదారులకు ఇచ్చారు. జిల్లాలో 7.10 లక్షల రేషన్ కార్డులున్నాయి. రేషన్‌డిపోల నుంచి పేదలతో పాటు.. అంగన్‌వాడీ కేంద్రాలకూ, పాఠశాలలకూ ఈ బియ్యమే వెళ్తాయి. ఎంఎల్‌ఎస్ కేంద్రాల్లో సిబ్బంది చేతివాటం, తూకాల్లో మోసాలతో రేషన్ డీలర్లు.. ఇలా ఎవరికి వారే మోసాలకు పాల్పడుతూ అక్రమాలకు తెర తీస్తున్నారు. చాలావరకూ కార్డులు అనర్హుల చేతిలోనే ఉన్నాయి. వీరు రేషన్‌కార్డులను ఇతర అవసరాల కోసం తప్ఫ.. సరకుల కోసం ఉపయోగించరు. వీరంతా బియ్యాన్ని రేషన్ డీలర్లకే వదిలేస్తున్నారు. అలా సేకరించిన బియ్యాన్ని డీలర్లు వ్యాపారులకు, మిల్లర్లకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ రాయితీ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులకు సంబంధించి 29 కేసులనే అధికారులు నమోదు చేయగలిగారు. దీనికి సంబంధించి 1,056 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి 6ఏ కేసులు నమోదు చేశారు. ఎప్పటికప్పుడు తహసీల్దార్ల నుంచి పౌరసరఫరాల డీటీల వరకూ చౌకధరల దుకాణాలను తనిఖీ చేయాల్సి ఉన్నా.. సిబ్బంది కొరత, ఇతరత్రా వ్యవహారాల వల్ల ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడం లేదన్న విమర్శలున్నాయి.
ఇవీ చూడండి... 'వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి'