విజయనగరం జిల్లా సాలూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందించేందుకు 10ఆక్సిజన్ సిలెండర్లను సాలూరుకు చెందిన ప్రాణదాత ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆసుపత్రి వైద్యులకు అందించారు. గురువారం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తికి అందించారు.
మూడు రోజుల కిందట 10 ఫ్లో మీటర్ కిట్స్ అందజేయడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు అన్నారు. కరోనా మహమ్మారికి సాలూరు పట్టణంలో ఇంకెవరూ బలి అవ్వకూడదనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారికి ఆక్సిజన్ లేదనే మాట రాకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సాలూరు ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రామ్మూర్తిని ప్రాణదాత ట్రస్ట్ సభ్యులు కోరారు.
సాలూరులోని సేవా సంఘాలైన ఆర్యవైశ్య సంఘం, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, సాలూరు ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్ తదితర సంఘాలతో పాటు పలువురు దాతల సహకారంతో ఆక్సిజన్ సిలిండర్లు, ఫ్లో మీటర్ కిట్స్‌ను అందించామన్నారు. కొద్దిరోజుల కిందట పట్టణంలోని ఫిలడెల్ఫియా సామాజిక ఆసుపత్రికి 40 ఆక్సిజన్ సిలిండర్లను ట్రస్ట్ ఉచితంగా ఇచ్చినట్లు వారు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి