Gift to Minister KTR: తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రముఖ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక ఆయనకు అరుదైన బహుమతి సిద్ధం చేసింది. స్వయంగా.. కేటీఆర్ అభిమాని అయిన స్వప్నిక... రేపు ఆయన జన్మదినం సందర్భంగా తన అద్భుత కళతో చిత్రపటాన్ని గీసింది. మాటలతో, చేతలతో, సాయం చేయటం, ఒకరికి సపోర్ట్‌గా నిలవటం లాంటి ఎన్నో విషయాల్లో తననెంతో ప్రేరేపించిన కేటీఆర్‌ను అన్నయ్యగా సంబోధిస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. కేటీఆర్ చేసే సేవా కార్యక్రమాలు, ప్రత్యేకించి పంజాబ్‌కు చెందిన దివ్యాంగ చెస్ క్రీడాకారిణి మల్లికా హండాకు తానున్నాంటూ ధైర్యం ఇచ్చి చేసిన 15 లక్షల ఆర్థిక సాయం తనలో ఎంతగానో స్ఫూర్తి నింపాయని స్వప్నిక తన అంతరంగాన్ని వెలిబుచ్చింది. ఆ సాయం తనలాంటి వారికి ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చిందని అభిప్రాయపడింది. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. తనను కలిసేందుకు ఒక్క అవకాశం ఇస్తే.. తను గీసిన చిత్రాన్ని అందిస్తానని ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌ను స్వప్నిక కోరింది.
"జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్ అన్నయ్య. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మీ చెల్లి స్వప్నిక కోరుకుంటోంది. మీరంటే నాకెంతో అభిమానం. మీరొక గొప్ప వ్యక్తి. మీ పుట్టిన రోజు సందర్భంగా మీ డ్రాయింగ్ వేశాను. మీరు చేసే సేవా కార్యక్రమాలు నాకెంతో నచ్చుతాయి. అందులో.. జనవరి 10న పంజాబ్ దివ్యాంగురాలైన చెస్ ప్లేయర్‌కు మీరు సపోర్ట్‌గా ఉండటం నన్నెంతో కదిలించింది. ఎందుకంటే.. మాలాంటి వాళ్లకు మీలాంటి వ్యక్తులు చేయూతనిస్తూంటే.. ఇంకా మరెన్నో సాధించాలన్న స్ఫూర్తి కలుగుతుంది. ఇలాంటివి చేస్తూ.. మీరు ఒక రోల్ మోడల్‌గా ఉన్నారు. సో.. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా.." - స్వప్నిక, ప్రముఖ మౌత్ ఆర్టిస్ట్
విజయనగరం జిల్లా నాయారాలవలసకు చెందిన స్వప్నిక.. చిన్నప్పుడు విద్యుత్ షాక్ వల్ల రెండు చేతులు కోల్పోయింది. అయినా.. ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా నోటితోనే అద్భుతంగా పెయింటింగ్స్ వేయడం నేర్చుకుంది. సినీ ప్రముఖులు, సామాజికవేత్తలు, రాజకీయ నేతల చిత్రపటాలతో పాటు సామాజిక అంశాలు, ఆడపిల్లలకు సంబంధించిన అంశాలపై తన నోటితోనే కళాఖండాలను గీస్తూ.. అబ్బురపరుస్తుంటుంది. ఈ మధ్య విడుదలైన రాధేశ్యామ్ సినిమాలోని ఓ సన్నివేశం తననెంతో కదిలించిందని.. ఆ మూవీకి సంబంధించి ఓ పెయింటింగ్ వేసింది. దాన్ని ఆ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణకు అందించి.. 'రాధేశ్యామ్' తననెంతో కదిలించిందని.. అలాంటి సన్నివేశాలతో తనలాంటి వాళ్లలో స్పూర్తి నింపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది.
ఇవీ చదవండి: