ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రామతీర్థం కొండపై రాముడి విగ్రహం ధ్వంసమైన ప్రాంతంతో పాటు అక్కడి కోనేరును మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి దుర్ఘటనకు పాల్పడినవారిని భగవంతుడు క్షమించడని చెప్పారు. ప్రభుత్వంపై బురద చల్లడం తెదేపా నాయకులకు సమంజసం కాదన్నారు.
చేయించింది చంద్రబాబే: మంత్రి బొత్స
రామతీర్థం ఘటనను చేయించింది చంద్రబాబే అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అన్నింటికి మూలమైన ఆయన మళ్లీ రామతీర్థానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే వాస్తవాలు బయటకు తీసి.. నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. ప్రభుత్వం తలపెడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు.
రామతీర్థం ఘటనతో తెదేపాకు సంబంధం ఉంది. చంద్రబాబు అండతోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయసాయిరెడ్డిపై కావాలని కొందరు రాళ్లతో దాడి చేయించారు. అల్లకల్లోలం చేసేందుకు యత్నించారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు తెదేపా కుట్రలు పన్నుతోంది. చంద్రబాబు, లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదు- మంత్రి బొత్స సత్యనారాయణ
రాజకీయ లబ్ధి కోసమే : మంత్రి వెల్లంపల్లి
'రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు రామతీర్థానికి వచ్చారు. అసలు ఆయనకు దేవుడిపై నమ్మకం ఉందా..? హిందూ సంప్రాదాయాలను ఏనాడైనా పట్టించుకున్నారా..? వందల సంఖ్యలో ఆలయాలను కూల్చివేసిన చరిత్ర చంద్రబాబుది. రామతీర్థం ఘటనలో నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తాం. రాముడికి అన్యాయం చేసినవాళ్లు తొందర్లోనే బయటపడతారు. దేవుడి ఆగ్రహానికి బలికాక తప్పదు. ఆలయాన్ని ఆధునీకరిస్తాం. రామతీర్థం పవిత్రతను కాపాడేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం'.- వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయశాఖ మంత్రి
ఇదీ చదవండి
రామతీర్థం ఘటన.. దేశం మొత్తానికి జరిగిన అవమానం: సునీల్ దేవధర్