బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం, మాన్సాస్, సింహాచలం దేవస్థానం భూములపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. భూముల అన్యాక్రాంతంలో ప్రమేయం ఉన్న వారిని ఎవరినీ విడిచిపెట్టేది లేదన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్సలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సింహాచలం దేవస్థానం భూములపై సమగ్ర విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఇద్దరు అధికారులు ప్రమేయం ఉందని నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నాం. గతంలో ఆయా సంస్థల ఛైర్మన్లుగా పనిచేసిన వారిపైనా విచారణ జరుగుతోంది. ఈ భూముల అన్యాక్రాంతంలో ప్రమేయం ఉన్న వారిని ఎవరినీ విడిచిపెట్టేది లేదు.- మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయశాఖ మంత్రి
స్వామివారి భూముల విషయంలో బొబ్బిలి రాజ కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించటానికి వారి మధ్య ఉన్న అంతర్గత విభేదాలే కారణమని భావిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. మాన్సాస్, సింహాచలం ఆస్తుల విషయాన్నీ లోతుగా పరిశీలించారు కాబట్టే అవకతవకలు బయటపడ్డాయన్నారు.
మాన్సాస్‌లో వారసత్వ పోరు ప్రభుత్వ దృష్టికి వచ్చిందని.. ఆ మేరకే ఆ కుటుంబంలో అర్హులైన వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించామని మంత్రి బొత్స అన్నారు. అనంతరం వారు కూడా కోర్టుకు వెళ్లారని.. న్యాయస్థానం పరంగా వారు ఆదేశాలను తెచ్చుకున్నారన్నారు. ప్రభుత్వ తాలూకు అభిప్రాయం ఉంది కాబట్టి.. తాము న్యాయస్థానానికి వెళ్లామని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయాలపై మంత్రులు, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయన్నారు.
ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ సూర్య కూమారి, సంయుక్త కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి
SUSPEND: సింహాచలం భూముల వ్యవహారంలో దేవాదాయ అధికారుల సస్పెండ్