తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకం వ్యవహారం ఈనాటిది కాదని.. గత ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నియమించిన సబ్ కమిటీ చేసిన తీర్మానాలు, సూచనలను మాత్రమే అమలు చేస్తున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. వైకాపా ఏడాది పాలనను పురస్కరించుకుని విజయనగరంలో జరిగిన మేదోమథన సదస్సులో పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ.. తితిదే భూముల విక్రయాలు తమ ప్రభుత్వం వచ్చాక చేపట్టినవి కాదన్నారు. గతంలో చదలవాడ కృష్ణమూర్తి తితిదే ఛైర్మన్గా ఉన్నప్పుడే ఈ వ్యవహారంపై సబ్ కమిటీ వేశారని.. ఆ కమిటీలో ఇప్పుడు విమర్శలు చేసిన వారందరూ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అప్పట్లో తితిదేకు చెందిన చిన్నపాటి ఆస్తులు, నిరర్థక ఆస్తుల అమ్మకాలు చేపట్టాలని సబ్ కమిటీ తీర్మానించిందని చెప్పారు. ఆ తీర్మానాలు, సూచనలు, సలహాలను ఇప్పుడు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
గతంలో ఆస్తుల అమ్మకాలకు సంబంధించి ప్రతిపాదన చేసినప్పుడు ఇప్పుడు విమర్శిస్తున్న వారు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారంతా రాజకీయాల కోసమే తప్ప.. దేవాలయ పవిత్రత, పరిపాలనను కాపాడే చిత్తశుద్ధి ఎవరికీ లేదని మంత్రి విమర్శించారు.
ఇవీ చదవండి... దేవుడి సొమ్ముకు ఆశపడేవాళ్లం కాదు: వైవీ సుబ్బారెడ్డి