వారంతా సొంత ఊరిలో పనుల్లేక రాజమహేంద్రవరం వలస వెళ్లారు ... లాక్డౌన్ వలన సొంత ఊరుకు వచ్చేశారు. కరోనా కష్టాల్లో సొంతూళ్లకు చేరుకున్న ఈ వలసకూలీలకు అక్కడా ఇబ్బందులు తప్పలేదు. విజయనగరం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన కూలీలు....రాజమహేంద్రవరం నుంచి మూడు రోజుల క్రితం స్వస్థలానికి వచ్చారు. కరోనా భయంతో గ్రామస్థులు వీళ్లను ఊరిలోకి రానివ్వలేదు. దగ్గరలో ఉన్న గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లగా 90 మంది ఖాళీ లేదని చెప్పి అక్కడినుంచి వీళ్ళని పంపించేశారు. దీంతో కురుపాం సమీపంలో ఓ జీడితోటలో 3 రోజులుగా ఉంటున్నారు. సరైన తిండి లేక గంజి నీళ్లు తాగి ఆకలి తీర్చుకుంటున్నారు. తాగటానికి నీరు సైతం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామనీ, అధికారులు తక్షణమే స్పందించి వైద్య పరీక్షలు జరిపించి, తమ సొంత గ్రామాలకు పంపించవలసిందిగా కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: బిడ్డ పెళ్లి లొల్లి.. తెగిన తల్లి తాళి!