Kisan Mela in Acharya NG Ranga Agricultural Versity: అధిక దిగుబడులిచ్చే ఆధునిక వంగడాలు.... ప్రాచీన విత్తన రకాలు, చిరుధాన్యాలు, వాటితో తయారైన చిరుతిళ్ల ప్రదర్శనకు వేదికైంది విజయనగరంలోని కిసాన్ మేళా. గాజలురేగ వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో... ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏటా ఆనవాయితీగా దీన్ని నిర్వహిస్తోంది. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు... అందుకు తగ్గట్టు పెరిగిన సేంద్రీయ ఉత్పత్తుల ప్రాధాన్యతపై రైతులకు అవగాహన కల్పిస్తోంది.
ఈ ఏడాది కిసాన్(kisan) మేళాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పండించిన సేంద్రీయ పంటలు, విత్తనాలు, చిరుధాన్యాలు, వాటి ఉప ఉత్పత్తులను ప్రదర్శించారు. వీటితోపాటు రైతులను లాభాల దిశగా నడిపించేందుకు సమీకృత వ్యవసాయ విధానాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పించారు.
రైతులకు ఆధునిక సాగు విధానాలతో పాటు స్వల్ప పెట్టుబడి పద్ధతులనూ కిసాన్ మేళాలో వక్తలు వివరించారు. పంటలు పండించటమే కాదు వాటి ఉప ఉత్పత్తుల తయారీ దిశగా సాగినప్పుడే అధిక ఆదాయం వస్తుందని తెలియజేశారు. పంటలను రైతులు నేరుగా మార్కెటింగ్ చేసుకొనేందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని సదస్సులో పాల్గొన్న కలెక్టర్ తెలిపారు.
కొవిడ్ వైరస్ లాంటి వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు ప్రజల జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని నిపుణులు సూచించారు. ఆరోగ్య వంతమైన జీవితానికి సేంద్రీయ ఉత్పత్తులు వాడాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: 543 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు