రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విజయనగరం జిల్లా సంయుక్త పాలనాధికారి(జేసీ) ఆర్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ బీమా, వైఎస్సార్ చేయూత పథకాల పురోగతిపై డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో కలిసి బ్యాంకుల ప్రతినిధులతో, వివిధ విభాగాల అధికారులతో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ఇప్పటి వరకు వివిధ పథకాల్లో చేరిన లబ్ధిదారుల వివరాలను, ఎంపిక ప్రక్రియలో ఏర్పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ బీమాలో లబ్ధిదారులను చేర్చే ప్రక్రియపై చర్చించారు. జిల్లాలో మొత్తం 6,97,161 మంది బియ్యం కార్డు లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటివరకు 5,92,908 మంది మాత్రమే చేరారని జేసీ వెల్లడించారు. మిగతా వారిని త్వరితగతిన సర్వే చేసి చేర్చాలని మెప్మా, డీఆర్డీఏ సిబ్బందిని ఆదేశించారు. 18 సంవత్సరాల లోపు, 70 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ల వివరాలు ప్రత్యేకంగా సేకరించాలని సూచించారు.
వైఎస్సార్ బీమా, చేయూత, జగనన్న తోడు పథక ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాలంటే ప్రతి ఒక్కరికీ ఖాతా తెరవాలని అన్నారు. ఖాతాలు తెరిచే విషయంలో ప్రభుత్వ సిబ్బందికి బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. సోమవారం నాటికల్లా ప్రతి లబ్ధిదారుకీ బ్యాంకు ఖాతా తెరవాలని... సమస్యలు ఉంటే పరిష్కరించి నివేదికలు అందజేయాలని సూచించారు. అనంతరం వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు పథకాల అమలుపై సమీక్షించి, తగిన సలహాలు సూచనలు అందజేశారు.
ఇదీ చదవండి: