సచివాలయ వ్యవస్థపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. ఆ దిశగా తనవంతు కృషిచేస్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్‌ను జాయింట్ కలెక్టర్ కలిశారు. అనంతరం మహేష్‌కుమార్ జాయింట్ కలెక్టర్-2గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మహేష్‌కుమార్ ఇంతకుముందు రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువచేయడమే తన లక్ష్యమన్నారు.
జాయింట్ కలెక్టర్ మహేష్‌కుమార్ తన స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. విజయవాడ సిద్దార్ధ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. నెల్లూరులో అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పొందిన తరువాత, చిత్తూరు జిల్లా తిరుపతి సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ పొందారు. అక్కడినుంచి తూర్పుగోదావరి జిల్లాకు సబ్‌కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇప్పుడు విజయనగరం జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చదవండి: విశాఖ ఘటనపై ఎన్జీటీకి కమిటీ నివేదిక.. పరిశీలించాకే తదుపరి ఆదేశాలు