Lightning strikes In Vizianagaram : మాయదారి పిడుగు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మరికొన్ని రోజుల్లో పోలీసుగా విధుల్లో చేరి.., కుటుంబాన్ని ఆదుకుంటాడని అతని తల్లిదండ్రులు కలలు కన్నారు. ఇంతలోనే వారి కలలు ఆడియాశలయ్యాయి. చేతికి అందొచ్చిన కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయిన తీరును చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పోస్టుమార్టం గదికి చేరుకున్న స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్న ఈ ఘటన విజయనగరంలోని గాజులరేగలో చోటు చేసుకుంది.
పిడుగు పడి ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు : ఈ ఘటనపై స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు., విజయనగరం గాజులరేగ ప్రాంతానికి చెందిన ఇజ్రాయిల్(22) తన స్నేహితులతో కలిసి సాయంత్రం సమీప మైదానంలో క్రికెటు ఆడుతున్నాడు. ఇజ్రాయిల్ బ్యాటింగ్ చేస్తుండగా., అఖిల్ బౌలింగ్, సురేష్ అంపియరింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో వీరి ముగ్గురు సమీపంలో పిడుగు పడటంతో ఇజ్రాయిల్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇతడికి దగ్గరగా ఉన్న సురేష్, అఖిల్ తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు ఇద్దర్నీ విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాత పరీక్షకు ఉత్తీర్ణత.. : పిడుగు పాటుకు మృతి చెందిన ఇజ్రాయిల్ స్వతహాగా మంచి క్రికెటర్. గత ఏడాది నుంచి బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. ఇటీవల కానిస్టేబుల్, ఎస్ఐ కొలువుల రాత పరీక్ష రాయగా, రెండింట్లోనూ ఉత్తీర్ణత సాధించాడు. చిత్తూరు జిల్లాలో ఈ నెల 26న నిర్వహించనున్న కానిస్టేబుల్ ఈవెంటు పరీక్షలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం బయలుదేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతుండగా.., ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
అడియాశలైన తల్లిదండ్రుల ఆశలు : పోలీసు కావాలన్నది ఇజ్రాయిల్ కల. ఈ తరుణంలో పిడుగు రూపంలో మృత్యువు అతడిని కబళించింది. మృతునికి తల్లిదండ్రులు మరియమ్మ, యాకుబ్‌లతో పాటు సోదరి ఉన్నారు. తండ్రి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారుడు ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి.
" మా బావ గారి బాబు.. అతనే పెద్ద కొడుకు. డిగ్రీ పూర్తి అయ్యింది. కోచింగ్లు, ట్రైనింగ్లు తీసుకున్నారు. మా కుటుంబానికి అండగా ఉండేవారు. " - మేరి, మృత్యుని పిన్ని
పిడుగు పడటంతో పలువురికి గాయాలు : గజపతినగరం మండలం గుడివాడ సమీపంలో పిడుగు పడటంతో పశువుల కాపారి నాగిరెడ్డి అప్పలస్వామి (61) తీవ్రంగా గాయపడ్డారు.తీవ్ర గాయాలైన నాగిరెడ్డి అప్పలస్వామిని గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి బొబ్బిలికి ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులు., గణేష్, కృష్ణవేణి పిడుగుపాటుకు స్వల్పంగా గాయపడ్డారు.
ఇవీ చదవండి