చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగానీ... మంచి పుస్తకం కొనుక్కో అని మహాత్మా గాంధీ చెప్పారు. ఇప్పుడు పుస్తకాలు చెదలుపట్టి చిరిగిపోతున్నాయే తప్ప వాటిని ముట్టుకునే అవసరం, ఆసక్తి నేటి తరానికి లేదు. అంతగా కావాలనుకుంటే డిజిటల్ రూపంలో ఉన్నవాటిని ఖాళీ ఉన్నప్పుడు చదువుతున్నారు గానీ ముద్రితమైన పుస్తకాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. పుస్తక పఠనంలో ఉన్న ఆపాత మధురాన్ని అందరికీ పరిచయం చేసేందుకు చీపురుపల్లికి చెందిన రెడ్డి రమణ బైక్ లైబ్రరీని నిర్వహిస్తున్నారు.
రెడ్డి రమణ.... ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తూ ఆశయసేవా సంస్థ పేరిట పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో విద్య, వైద్యం, పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు 2005 నుంచి కృషి చేస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దాతల సహకారంతో సామాజిక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. గ్రంథాలయాలకు వచ్చి చదివేవారి సంఖ్య తగ్గిపోవటంతో అవి మూతపడేవి. దీనికి పరిష్కారం చూపేందుకు మేథోమథనం చేసిన ఆయన మొబైల్ లైబ్రరీ పేరుతో సెల్‌ఫోన్ సిగ్నల్ లేని గ్రామస్థులకు పుస్తకాలను పరిచయం చేస్తున్నారు.
అన్ని వయసులవారికీ ఆసక్తి కలిగించే పుస్తకాలు అందుబాటులో ఉంచటంతో.... మంచి స్పందన వచ్చిందని రెడ్డి రమణ చెప్పారు. సంచార గ్రంథాలయం చూసి తొలుత ఆశ్చర్యపోయిన యువత, విద్యార్థులు... తమకు అవసరమైన పుస్తకాలు లభిస్తున్నందున సంతోషం వ్యక్తం చేశారు. ఏ గ్రామమేగినా... ఎక్కడ కాలిడినా... మేథస్సు పెంచే పుస్తక పఠనానికి ప్రాధాన్యమివ్వాలన్న సందేశాన్నే రెడ్డి రమణ వినిపిస్తున్నారు.
ఇదీ చదవండీ... అప్పు తీర్చలేదని తండ్రీ కొడుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు!