జడ్పీటీసీ, ఎంపీటీసీ నామపత్రాలకు బుధవారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు పోటెత్తారు. పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడంతో నామపత్రాలు దాఖలు చేసేందుకు వరుస కట్టారు. నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా తరలివచ్చారు. మండల పరిషత్తు కార్యాలయాలు కోలాహలంగా మారాయి. జడ్పీ కార్యాలయంలో జడ్పీటీసీ నామపత్రాలను స్వీకరించారు. పత్రాల పరిశీలనకు కార్యాలయంలో ప్రత్యేకంగా మూడు విభాగాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 9 నుంచి నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. మూడు రోజులకు 34 జడ్పీటీసీ స్థానాలకు 241 దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే 206 మంది సమర్పించారు. ఎంపీటీసీ స్థానాల్లో పూసపాటిరేగలో అధికంగా 116 దాఖలయ్యాయి.
అభ్యర్థుల వెంట నేతలు..!
నామపత్రాల దాఖలుకు అభ్యర్థుల వెంట పలువురు నేతలు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఎల్.కోట, ఎస్.కోట జడ్పీటీసీ అభ్యర్థులతో హాజరయ్యారు. విజయనగరం జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల వెంట ఎమ్మెల్యే కోలగట్ల ఉన్నారు. గంట్యాడ జడ్పీటీసీ అభ్యర్థి వర్రి నర్సింహమూర్తితో వైకాపా నాయకులు కొండపల్లి కొండలరావు వచ్చారు. పార్వతీపురం మండలం జడ్పీటీసీ అభ్యర్థి గొట్టాపు గౌరీశ్వరి నామపత్రానికి తెదేపా జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు హాజరయ్యారు. గరుగుబిల్లి జడ్పీటీసీ అభ్యర్థి వెంట డీసీసీబీ అధ్యక్షురాలు తులసి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే జయరాజు హాజరయ్యారు.
ఇదీ చదవండి:పోలీసుల సాక్షిగా... ప్రత్యర్థులపై దాడులు