విజయనగరంలోని మహారాజ కళాశాల విద్యార్థులు, గురువులు, సిబ్బంది దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఇక్కడ చదువు కోసం వచ్చే విద్యార్ధులు.. విద్యాబుద్ధులతో పాటు సేవా గుణాన్ని నేర్చుకొని మరీ వెళ్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి తోటి వారికి, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే పేదల కోసం వినూత్నంగా "గుప్పెడు బియ్యం" అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
"గుప్పెడు బియ్యం" మొదలైంది ఇలా..
పేద విద్యార్థులకు సాహాయపడాలనే ఆలోచనతో తొలుత కళాశాల నిర్వాహకులు... స్పందన పేరుతో ఓ కార్యక్రమం అమలు చేశారు. కళాశాలలో చదివే పేద విద్యార్ధులకు ఆర్థిక చేయూత ఇవ్వాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. నిర్వాహకులు తోచిన సాయం చేస్తూ.. వచ్చిన మొత్తాన్ని పేద విద్యార్థుకు మధ్యాహ్న భోజనం పెట్టడం, పుస్తకాలు, రుసుములకు ఆర్థిక సహకారం అందించేందుకు వినియోగించేవారు. ఈ క్రమంలోనే "గుప్పెడు బియ్యం" అనే కార్యక్రమంగా 2015 జనవరిలో రూపొందుకుంది. ప్రతీ ఒక్కరూ కనీసం గుప్పెడు బియ్యానైనా ఇవ్వాలన్నది ముఖ్య ఉద్దేశ్యం. ఇలా సేకరించిన బియ్యాన్నే పేదలకు పంపిణీ చేస్తున్నారు.
కళాశాల దాతృత్వానికి అనేక మంది సహకారం తోడవుతోంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు వేలాది కిలోల బియ్యం సేకరించారు. వచ్చిన నగదు, బియ్యం పేదలకు పంపిణీ చేసినట్లు కళాశాల అధికారులు పేర్కొంటున్నారు. వీరి సేవా గుణానికి మేము సైతం అంటూ మాన్సాస్ సంస్థ ఆసరాగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశలోనే దాతృత్వం అలవడటమనేది గొప్ప విషయమని కళాశాల అధికారులు అంటున్నారు.
'గుప్పెడు బియ్యం' అనే మహత్తర కార్యక్రమంతో ఎందరికో ఆదర్శవంతం. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంత మంది ముందుకురావాలని ఆశిద్దాం.
ఇదీ చదవండి: విద్యార్థుల చేతుల్లో ప్రాణం పోసుకుంటున్న కళారూపాలు!