భోగాపురంలో విమానాశ్రయానికి 500 ఎకరాలు వైకాపా ప్రభుత్వం తగ్గించటాన్ని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు మరోసారి తప్పుబట్టారు. రన్‌వేను తగ్గిస్తే ప్రజల జీవితాలతో ఆడుకోవడమేనని ఆయన అన్నారు. విమానాశ్రయాల్లో మౌలిక వసతులతో ఆడుకోవటం మంచిది కాదని స్పష్టం చేశారు.
అమరావతి, విశాఖపట్నం ప్రతిష్ఠను దిగజార్చాలని వైకాపా ప్రభుత్వం చూడటం మహా ఘోరం. విశాఖపట్నానికి మంచి విమానాశ్రయం రావాలని భోగాపురంలో కొత్త విమానాశ్రయాన్ని తలపెట్టాం. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ 500 ఎకరాలు తగ్గించింది. దీనికి కారణమేంటో ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. రన్ వే తగ్గిస్తే ప్రజల జీవితాలతో ఆడుకోవడమే అవుతుంది. ఘోర ప్రమాదానికి కారణమైన కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో... రన్ వే విస్తరణ ఆవశ్యకతను గతంలోనే గుర్తించాం. ఆ భూమి సేకరించారో లేదో తెలియదు. గన్నవరంలో కూడా 900 ఎకరాల భూమిని రైతులిచ్చారు కాబట్టే పనులు పూర్తవుతున్నాయి- అశోక్ గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి
అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగించి, రైతుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు. ఒక నగరాన్ని నాశనం చేసి భవిష్యత్‌ను అంధకారం చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి