చారిత్రక ఆధారాలు...
1890 ప్రాంతంలో విజయనగరం నడిబొడ్డున మూడులాంతర్లు నిర్మించారు. విజయనగర సామ్రాజ్యానికి చివరి పట్టాభిషిక్తుడైన పీవీజీ రాజు తాత, చినవిజయరామరావు హయాంలో దీనిని నిర్మించినట్లు చారిత్రాక ఆధారాలు చెబుతున్నాయి. ఆనాడు విజయనగరంలో నిర్మించిన గంటస్తంభం, కోట, సంగీత కళాశాల, మూడులాంతర్లు ఎంతో ప్రసిద్ధి. ఈ మూడు నిర్మాణాలను విజయనగరం చరిత్ర నుంచి వేరు చేసి చూడలేం.
అయితే.. ఆధునీకీకరణ పేరుతో మూడులాంతర్లను ప్రజల కళ్ల ముందు లేకుండా చేశారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన మూడు లాంతర్లను కూల్చివేయటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన మూడు లాంతర్లను రహస్యంగా తొలగించటం సరికాదని వామపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఎవరికి చెప్పకుండా... ఎవరి అభిప్రాయం తీసుకోకుండా తొలగించటం దారుణమని వామపక్షనేతలు మండిపడ్డారు.
ఇది ఎంతో బాధాకరం...
మూడులాంతర్ల కూల్చివేతపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి, విజయనగర రాజుల వంశస్థులు అశోక్ గజపతి రాజు కూడా ఘాటుగా స్పందించారు. మూడులాంతర్ల జంక్షన్ వద్ద హరికథ పితామహుడు ఆదిబట్ల నారాయణ దాసు హరికథలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి చారిత్రక కట్టడాలు కూల్చివేత బాధాకరమన్నారు. మూడులాంతర్ల వద్ద స్వతంత్ర సమరయోధులు నిర్మించిన మూడు సింహాలు చిహ్ననికి ఇప్పటి ప్రభుత్వాలు, అధికారులు గౌరవం ఇవ్వకపోవటం విచారకరమన్నారు. ఈ సంఘటనపై ప్రజలు స్పందించాలని... చరిత్ర అనవాళ్లకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆ ప్రదేశం అపవిత్రమైపోయింది..
మూడు లాంతర్లను కూల్చివేయటంతో ఆ ప్రదేశం అపవిత్రమైపోయిందంటూ.... విజయనగరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్ అదితి గజపతిరాజు పాలాభిషేకం నిర్వహించారు. అధికారుల తీరును నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, జనసేన నేతలు ఆందోళన చేశారు. చరిత్ర ఆనవాళ్లను తెలియజేసే కట్టడాలు లేకుండా చేయటం అన్యాయమని మండిపడ్డారు.
ఉద్దేశపూర్వకంగా చేసే కుట్రల్లో ఇదొక్కటి...
విజయనగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక మూడు లాంతర్ల స్తంభాన్ని పడగొట్టడంపై తెదేపా అధినేత చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి అశోక్ గజపతిరాజు కుటుంబం చేసిన కృషిని చెరిపేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రల్లో ఇదొక్కటని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చరిత్రలో ఎప్పుడూ పైచేయి సాధించలేదని చెప్పారు.
కొత్తది నిర్మిస్తాం....
ఇదిలా ఉండగా... సరికొత్తగా మూడులాంతర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేయటం కొసమెరుపు. నగర సుందరీకరణ చర్యల్లో భాగంగానే మూడులాంతర్ల కూడలిని అభివృద్ధి పరచనునట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్. ఎస్ వర్మ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం... పురపాలక సంఘం నుంచి నగరపాలక సంస్థగా ఆవిర్భవించినందున నగర ప్రధాన కూడళ్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రాజకీయ ప్రమేయమేమీ లేదని పేర్కొన్నారు.
ఇదీచూడండి.