GVL acting agent in sale of steel plant: స్టీల్ ప్లాంట్ అమ్మేందుకు ఒక ఏజెంట్‌గా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యవహరించడం మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం హెచ్చరించారు. మద్దిలపాలెంలోని సీపీఎం విశాఖ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్‌లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రజలపైన జీవీఎల్‌కు అమితమైన ప్రేమ ఉన్నట్లుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.
సొంతగనులు ఏవి..: ప్లాంట్ రిక్రూట్‌కోసం, ప్లాంట్ నష్టాల కోసం పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తి... ప్లాంట్‌ను మరింత నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించడం కోసం ఏనాడు ప్రయత్నం చేయలేదన్నారు. విశాఖకు మెట్రో రైలు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు, రైల్వేజోన్ నిధులు, ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ నిధులు వంటి అంశాలు అనేకం ఉన్నప్పటికీ.. జీవీఎల్ ఏనాడు అలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు.
బీజేపీ నేతల విధానాలతో ముప్పు..: బీజేపి స్థానిక నాయకులు, ఎమ్మెల్సీ మాధవ్‌తో సహా కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలను మరింత బలపర్చే విధంగా, వాటిని అమలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ నష్టాలను సాకుగా చూపడం తగదన్నారు. నష్టాలకు కారణం సొంతగనులు కేటాయించకపోవడం, ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు కేంద్రం పెట్టుబడి కేవలం రూ.5వేల కోట్లు పెడితే రూ.52వేల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించదన్న వాస్తవాన్ని దాచి పెట్టడాన్ని ఆక్షేపించారు. జీవీఎల్ ఉత్తరాంధ్రకు నష్టం చేకూర్చే ఏజెంటుగా వ్యవహరించితే విశాఖలో అడుగుపెట్టనివ్వబోమని సీపీఎం నాయకులు హెచ్చరించారు.
ఇవీ చదవండి