ఇళ్లలో ఉన్న కరోనా బాధితులకు భరోసా కలిగించేందుకు కిట్లు అందించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 3 వేల కిట్లను సిద్ధం చేస్తోంది. డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరెక్టర్ కె.సుబ్బారావు నేతృత్వంలో సిబ్బంది గత రెండు మూడు రోజులుగా ఈ కిట్లను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ కిట్లలో పారాసిటమల్, పెంటాప్రోజోల్, యాంటీ బయోటిక్ టాబ్లెట్లు ఎమాప్సిలస్, హైడ్రాక్సి క్లోరోక్విన్, వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు మల్టీ విటమిన్, సి-విటమిన్ టాబ్లెట్లు.. మరికొన్నింటిని అందిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ చెప్పారు.
జిల్లాలోని పారా మెడికల్ సిబ్బంది, ఏ.ఎన్.ఎం.ల ద్వారా ఇళ్లలోనే వున్న పాజిటివ్ వ్యక్తులకు అందజేస్తామని మహేశ్ కుమార్ తెలిపారు. ఈ కిట్లతో పాటు ఏ.ఎన్.ఎం.ల ద్వారా వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఆక్సిజన్ లెవెల్స్ తనిఖీ చేస్తున్నామని, శరీర ఉష్ణోగ్రతలను కూడా తనిఖీ చేస్తూ తగిన సూచనలు చేస్తున్నామని చెప్పారు. వ్యాధి తీవ్రమైన వారిని ఆసుపత్రులకు కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 3 వేల మంది వరకు కొవిడ్ బాధితులు ఇళ్లలోనే వుంటున్నారని, వారందరికీ ఈ కిట్లు అందజేస్తామమని జాయింట్ కలెక్టర్ చెప్పారు.
ఇదీ చదవండి: తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారిపోయాయి