Vijaynagar train accident: రైలు ప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ, అక్టోబర్ 29: విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిగ్నల్ కోసం వేచి ఉన్న విశాఖపట్నం-పలాస ప్రత్యేక ప్యాసింజర్‌ను వెనుక నుంచి వస్తున్న విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం.. విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని మాట్లాడారు. సత్వరమే సహాయ చర్యలు చేపట్టాలని ప్రధాని రైల్వే మంత్రిని ఆదేశించారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సీఎం జగన్‌తో మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు.
సీఎం వైఎస్ జగన్: విజయనగరం సమీపంలో రైలు ప్రమాద ఘటనపై.. సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు సీఎంకు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని సీఎం ఆదేశించారు. మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించారు. క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, ఇతర రాష్ట్రాల మృతులకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తక్షణమే అందించాలని జగన్ ఆదేశించారు.
నారా లోకేశ్: రైలు ప్రమాద ఘటనపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన విశాఖ – రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాదం తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని పేర్కొన్నారు. సమీపంలో తెలుగుదేశం పార్టీ కేడర్ తక్షణమే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గాయపడిన, మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకోవాల్సిందిగా కోరుతున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
LIve Updates: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
పవన్ కల్యాణ్: విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని... మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలి. కంటకాపల్లి ప్రమాద స్థలంలో అవసరమైన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని జనసేన నాయకులకు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు.
దగ్గుబాటి పురంధేశ్వరి: రైలు ప్రమాదం పై బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది మృతి, పలువురు గాయపడిన సంఘటన లో బాదితుల కు అండగా నిలవాలని బీజేపీ శ్రేణులు కు పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
పట్టాలు క్రాస్ చేస్తుండగా ఢీకొన్న రెండు రైళ్లు.. ఆరుగురు మృతి! మృతుల సంఖ్య పెరిగే అవకాశం..