Public Distribution System: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేసి, వాటి వినియోగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో చిరు ధాన్యాల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన ఆరు జిల్లాల పౌరసరఫరాలశాఖ అధికారులతో.., చిరుధాన్యాల సాగు ప్రోత్సాహం, రైతులకు మార్కెటింగ్, మద్ధతు ధర కల్పనపై విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు కారుమూరి నాగేశ్వర రావు, బొత్స సత్యనారాయణ సమీక్షించారు.ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీర పాండ్యన్ హాజరు కాగా, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, విశాఖ, అరకు, అల్లూరి జిల్లాల పౌరసరఫరాలశాఖ అధికారులు, తూనికలు కొలతల అధికారులు పాల్గొన్నారు.
చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు: మంత్రులు తొలుత, చిరుధాన్యాల ప్రస్తుత సాగు విస్తీర్ణం, దిగుబడులు, పెంచే అవకాశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, రైతుల సాగు విధానాల ఆధారంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రులు అధికారులకు సూచించారు. అదే క్రమంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు. విజయనగరంలో పౌరసరఫరాలశాఖ అధికారుల ప్రాంతీయ సదస్సు అనంతరం, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వర రావు.., పౌరసరఫరాల శాఖ పంపిణీ చేయనున్న ఫోర్టిఫైడ్ చెక్కి గోధుమపిండిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ., అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేయాలని, వీటి వినియోగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని తెలిపారు.
కిలో రూ. 16 కే రేషన్ ద్వారా గోధుమ పిండి: ఇందులో భాగంగా చిరు ధాన్యాలు పండించడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి వారు చిరు ధాన్యాల సాగు చేపట్టేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా చిరుధాన్యాలు పండించే రైతులకు తగిన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, మద్దతు ధర కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా ఇకపై పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డు దారులకు ఫోర్టిఫైడ్ గోధుమపిండి సరఫరా చేస్తామన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావటంతో, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్నారు. ఒక్కో రేషన్ కార్డుపై కిలో గోధుమ పిండి సరఫరా చేస్తామన్నారు. కిలో 16 రూపాయల వంతున రేషన్ కార్డుదారులకు జులై నుంచి అందించనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరారవు ప్రకటించారు.