విశాఖ జిల్లా పెందుర్తి శాసనసభ్యుడు అదీప్ రాజు నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి గండి రవికుమార్ ఆరోపించారు. పరవాడ మండలంలోని దలయపాలెంలో ఎమ్మెల్యే 40 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. కానీ తన ఆధీనంలో ఆరు ఎకరాల భూమి ఉందని ఒకసారి.. ఇరవై ఐదు సెంట్ల స్థలంలో మాత్రమే తనకు గెస్ట్ హౌస్ ఉందని మరోసారి భిన్నంగా ప్రస్తావించారని ఆయన తెలిపారు. పెందుర్తి మండలం చీమలాపల్లిలో ఎమ్మెల్యే రూ. 10 కోట్ల విలువైన 2300 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.
పాలక వైఫల్యం కలసివచ్చింది..
నియోజకవర్గంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి భయబ్రాంతులకు గురి చేశారని ఎమ్మెల్యే అదీప్ రాజు ఆరోపించడాన్ని రవికుమార్ తప్పుబట్టారు. కేవలం పోలింగ్ బూత్ ఏజెంట్‌గా లోనికి ప్రవేశించారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అసమర్థ పాలన వల్లే తెదేపా మున్సిపల్ ఎన్నికల్లో 10వార్డుల్లో ఎనిమిదింటిని గెలుపొందిందని గుర్తు చేశారు. పరిషత్ ఫలితాల్లో ఇదే జోరు కొనసాగుతుందని రవి కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ పాలకవర్గం తీర్మానం