విశాఖ జిల్లా చింతపల్లి మండలం రాకోట గ్రామంలో పెళ్లింట విషాదం జరిగింది. గ్రామానికి చెందిన దేశగిరి రజినీకాంత్ (25) అనే యువకుడు మరణించాడు. అతనికి మరో రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. రజినీకాంత్ పరవాడలోని తపాల శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఏం జరిగింది..
రజినీకాంత్కు రోలుగుంట మండలం అర్ల గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఏర్పాట్లలో భాగంగా అత్తవారింటికి వెళ్లిన అతనికి జ్వరం వచ్చింది. స్థానిక ఆరోగ్య కార్యకర్త హరిబాబు అతనికి వైద్యం అందించారు. అనంతరం నర్సీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతనికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే అక్కడి నుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలోని కరోనా కేంద్రానికి పంపించారు. అక్కడ అతనికి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఉండటంతో విశాఖపట్నం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. నగరంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా.. రజినీకాంత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆరోగ్య కార్యకర్త అందించిన వైద్యమే అతని మరణానికి కారణమైనట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: విజయనగరం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి