విశాఖ మన్యం కొట్నపల్లి పంచాయితీ పెదగరువులోని ఆర్ అండ్ బీకి చెందిన పాత రహదారిని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పాడేరు నుంచి అరకు వెళ్లే రహదారి పక్కన ఉన్న ఈ ప్రాంతం... ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. 2004లో కొత్తగా అప్రోచ్ రోడ్డు వేయటంతో దీనిని ఎవరూ వినియోగించటం లేదు.
రాత్రి పూట చదును
పెదగరువు బ్రిడ్జి కింద ఉన్న పాత రహదారి కబ్జాకు గురవుతోందని చెబుతున్నారు స్థానికులు. ఈ ప్రాంతం రహదారికి కొంచెం దిగువున ఉంది. చుట్టూ కొండ దిబ్బలు ఉండటంతో వైకాపా హుకుంపేట నాయకుడు చదును చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. బుధవారం రాత్రికి రాత్రే మూడు జేసీబీల ద్వారా రహదారిని చదును చేసే ప్రయత్నం చేశారని వెల్లడించారు. కొంత స్థలం చదును చేశాక... విషయం తెలుసుకున్న పెదగరువు గ్రామస్తులు అడ్డుకున్నారని... కబ్జాపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారికి ఫోన్లో చెప్పారు.
రాజకీయ నాయకుల అండదండలతోనే మండల నాయకులు ఇలా కబ్జాకు దిగుతున్నారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి కబ్జాను నిలుపుదల చేయాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో స్థానిక గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి
రాజధానిలో పెట్టింది ప్రజల సొమ్ము.. ఖజానాకు నష్టం కదా..: హైకోర్టు