Visakha Steel Plant Issue: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆరు వందల రోజులకు పైగా.. వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న కార్మికులు, నిర్వాసితులు.. ప్రధాని పర్యటన తరుణంలో పోరాటం ఉద్ధృతం చేశారు. ప్రధాని పర్యటన తేదీలు వెలువడిన నాటి నుంచే నిరసనలు పెంచిన స్టీల్‌ప్లాంట్ పోరాట సమితి... డీఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు , వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రధాని పర్యటనతో పాటు వీఐపీల మూమెంట్ ఉన్నందున అనుమతి లేదంటూ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కార్మికులు, నిరసనకారులతోపాటు విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
అరెస్టులు, నిర్బంధాలతో పోరాటాన్ని అడ్డుకోలేరన్న నేతలు, కార్మికులు ప్లాంట్‌ను ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. వందలాది మంది త్యాగాలతో ఏర్పడ్డ ఉక్కు పరిశ్రమను.. మళ్లీ అదే త్యాగాలతో కాపాడుకుంటామని తెలిపారు.
ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందిన అనేక మంది రోడ్డున పడతారని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్లాంట్ కోసం జరిగిన పోరాటాన్ని, నిర్వాసితుల కష్టాన్ని బహిరంగసభలో ప్రధానికి వివరించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్‌ను ప్రభుత్వరంగంలోనే కొనసాగించేలా సీఎం జగన్ ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.
10, 11, 12 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవడంతోపాటు.. కార్మికులు, నిర్వాసితుల ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని తీర్మానించారు. 11న వేలాదిమందితో కూర్మన్నపాలెంలో పెద్ద ఎత్తున నిరసనకు చేపట్టాలని పోరాట సమితి నిర్ణయించింది.
ఇవీ చదవండి: