విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కార్మికులు నిరసనను తీవ్రతరం చేశారు. ఈ ఉదయం నుంచే ఉద్యోగులు, కార్మిక సంఘాలు లోనికి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. రూ. వేల కోట్ల పన్నుల రూపంలో చెల్లిస్తున్నా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థను కొనుగోలు చేయడానికి ఎవరు వచ్చినా విశాఖ విమానాశ్రయంలోనే అడ్డుకుంటామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే సరిపోదని, చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించేలా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా లావాదేవీల సలహాదారు (ట్రాన్సాక్షన్ అడ్వయిజర్), న్యాయ సలహాదారుల (లీగల్ అడ్వయిజర్) నియామకానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
అత్యంత క్లిష్టమైన ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా చిక్కులు రాకుండా ఉండేందుకు సలహాదారులు ఇచ్చే సూచనలు, సిఫార్సులు ఎంతో ముఖ్యం. కీలకమైన వీరి నియామకానికి టెండర్లు పిలవాల్సి ఉంది. టెండర్లో ముందు నిలిచిన వారికి ప్రైవేటీకరణ ప్రక్రియ బాధ్యతలను అప్పగిస్తారు. ఒకవైపు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్రంలో భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు, కర్మాగార ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం ఇలా ముందడుగు వేయడంపై కార్మికుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా కేంద్రం మరో అడుగు.. కన్సల్టెంట్ నియామకానికి నోటిఫికేషన్