గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి... రవాణాదారులను అరెస్టు చేస్తున్నారు. కానీ స్మగ్లర్లు మాత్రం కొత్త ఆలోచనలతో గంజాయిని తరలిస్తూనే ఉన్నారు. ఈ రోజే నాలుగుచోట్ల గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు ఉండటం గమనార్హం.
చిత్తూరు జిల్లా....
కళాశాలలోనే గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను చిత్తూరు జిల్లా తిరుపతి తూర్పు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. కళాశాలలోని మరికొంత మంది స్నేహితులతో కలిసి తమిళనాడు వేలూరులో తాము చదువుకుంటున్న విట్ కళాశాలలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 7కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని కేజీ 5వేలకు కొనుగోలు చేసి కళాశాలలో... కేజీ 9వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.
నెల్లూరు జిల్లా...
నెల్లూరులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను కావలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, వీరి నుంచి లక్షా 60 వేల రూపాయల విలువ చేసే 16 కిలోల గంజాయి, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. వీరంతా వేలూరులోని విట్ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. విశాఖ జిల్లా అరకులో గంజాయి కొనుగోలు చేసి కళాశాలలో విక్రయిస్తున్నట్లు కావలి డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.
విశాఖ జిల్లా...
విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి నుంచి రాజమండ్రి తరలిస్తున్న 2.5లక్షల విలువైన 110 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలతో పాటు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం జిల్లా...
అనంతపురం జిల్లా రాయాపురం గ్రామంలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారనే సమాచారంతో మడకశిర సీఐ దేవానంద్ సిబ్బంది దాడులు జరిపారు. ఇంటి పరిసరాల్లో ఆరడుగుల ఎత్తుగల సుమారు 89 గంజాయి మొక్కలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులను అరెస్టు చేశారు.
ఎన్ని దాడులు జరిగిన గంజాయి అక్రమ రవాణను మాత్రం పోలీసులు అరికట్టలేకపోతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటేనే దీనిని అరికట్టవచ్చని ప్రజలంటున్నారు.
ఇదీ చూడండి