INTRENATIONAL WOMENs DAY : మార్చి 8.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు వాట్సాప్‌ల్లో స్టేటస్, ఫేస్బుక్లో స్టోరీలు, మీడియాలో కథనాలు, షేర్‌చాట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఎన్ని ఉంటే అన్ని రకాలుగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడతారు. సమాజంలో మహిళలు తమకంటూ సాధించుకున్న గుర్తింపులు, వాళ్లు సాధించిన విజయాలు, అన్ని రంగాల్లో పురుషుల కన్నా ఎక్కువగా మహిళలే రాణిస్తున్నారు అని తెలిపేలా వారి విజయగాథలను పోస్టు చేస్తుంటారు. అయితే కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజూ మహిళలను గౌరవించాలని చాలా మంది కోరుకుంటారు. అది వేరే విషయం అనుకోండి.
అయితే చాలా మంది విషెస్‌తో సరిపెట్టకుండా వాళ్లకి గుర్తుండి పోయేలాగా దానిని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఆఫీసుల్లో, ఆసుపత్రి ఇలా ఒక్కచోట ఏంటి చాలా చోట్ల వాళ్లకి నచ్చిన విధంగా సెలబ్రేట్ చేస్తారు. అయితే ఇక్కడ కూడా ఆ అధికారులు వాళ్ల మహిళా సిబ్బందికి అలాగే చేశారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా విశాఖపట్నం నుంచి రాయగడ వరకు మహిళా సిబ్బందితో కూడిన ప్రత్యేక రైలును వాల్తేర్ డివిజన్ నడిపింది. తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ మహిళా సంక్షేమ సంస్థ అధ్యక్షురాలు పారిజాత సత్పతి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.
ఈ రైలులో డ్రైవర్, గార్డ్, టికెట్ చెకింగ్ స్టాఫ్, మెకానిక్స్, ఆర్పీఎఫ్ సిబ్బంది అందరూ మహిళలే ఉంటారని డీఆర్ఎం తెలిపారు. రూట్ రిలే ఇంటర్ లాకింగ్, రైలు మేనేజర్లు, లోకో పైలట్లు, టికెట్ చెకింగ్, ఆఫీసు విధుల్లో బృందం నిర్వహించే ట్రాక్ మెయింటెనెన్స్, ట్రైన్ ఆపరేషన్స్‌లో మహిళలను నిమగ్నం చేయడం ద్వారా మహిళా సాధికారతను భుజాన వేసుకోవడంలో వాల్తేరు డివిజన్ ఎల్లప్పుడూ ముందుందని తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వాకథాన్‌ను నిర్వహించారు. ఈ వాకథాన్‌ను వాల్తేర్ డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలిలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజల్లో మహిళల పట్ల మరింత చైతన్యం తీసుకురావడంలో భాగంగా ఈ వాకథాన్‌ను నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షురాలు పారిజాత సత్పతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్టేర్ డివిజన్ అధికారులు, మహిళ ఉద్యోగులు, ఆర్పీఎఫ్, సివిల్ డిఫెన్స్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. బీచ్ రోడ్డులోని ఈస్ట్ పాయింట్ రెస్ట్ హౌస్ వద్ద మొదలైన ఈ వాకథాన్ మత్స్యదర్శిని వరకు వెళ్లి తిరిగి ప్రారంభించిన చోటుకు రావడంతో ముగిసిందని తెలిపారు.
ఇవీ చదవండి: