విశాఖపట్నం విమానాశ్రయం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2014 విభజన తర్వాత రాష్ట్రానికి మిగిలిన ఈ ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం ఇదొక్కటే.. 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి.. 28 లక్షల 53 వేల 990 మంది ప్రయాణికులు ఈ ఎయిర్ పోర్టును వినియోగించుకున్నారు. 2017 - 18లో 24 లక్షల 81 వేల 666 మంది విమానాశ్రయం ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
ఇక్కడ నిబంధనలు కాస్త...
ఇక్కడ విమాన సర్వీసులు ఇతరత్రా నిబంధనలు... మిగిలిన ఎయిర్ పోర్టులతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. రక్షణ శాఖ అనుమతులు ప్రతీ అంశాలకు తప్పనిసరి కావడం విమానాశ్రయ విస్తరణకు అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. అయినా... 24 వేల 237 విమాన ట్రిప్పులకు విశాఖ విమానాశ్రయం స్థావరమైంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 4 వేల 200 ట్రిప్పులు ఎక్కువ.
కార్గో రవాణాలోనూ...
కార్గో రవాణాలోనూ విశాఖ ఎయిర్ పోర్టు.. 24 శాతం వృద్ధిని సాధించ గలిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 1200 టన్నులు ఎక్కువ. ప్రత్యేకంగా కార్గో విమానాల కోసం టెర్మినల్, గోదాముల సదుపాయం ఇక్కడ విస్తరించడంతోనే ఈ వృద్ధి సాధ్యపడింది. ఎయిర్ ఇండియా, ఎలయెన్స్ ఎయిర్, ఇండిగో, ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్, సిల్క్ ఎయిర్, ఎయిర్ ఏషియా బెర్హాద్, థాయ్ ఎయిర్ ఏషియా సంస్థలు తమ సర్వీసులను విశాఖ నుంచి నడుపుతున్నాయి. ఇంతగా సేవలు అందిస్తున్న ఈ విమానాశ్రయం.. గడచిన ఆర్థిక సంవత్సరంలో 15 శాతం ఆర్థిక వృద్ధి సాధించి ప్రాధాన్యాన్ని చాటుకుంది.
ఇంతటి ఫలితాలు సాధిస్తున్న విశాఖ ఎయిర్పోర్టును... రిమోట్ లోకేషన్ కింద పరిగణలోకి తీసుకుని టిక్కెట్ ధరలను తగ్గించాలన్న డిమాండ్ పెండింగ్లో ఉంది. దీన్ని పరిష్కరించాలని రాష్ట్ర ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ కోరుతోంది.
ఇదీ చదవండీ:ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా!