విశాఖ రైళ్లకు చెందిన అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ(లింక్ హాఫ్‌మన్ బుష్చ్) కోచ్‌ల్ని భువనేశ్వర్‌కు తరలించే ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందనే విమర్శలొస్తున్నాయి. తాజాగా ఇలాంటి మరో ఘటనా వెలుగులోకి వచ్చింది. విశాఖ-అమృత్‌సర్ మధ్య తిరిగే హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ నిమిత్తం వచ్చిన కోచ్‌ల్లో కొన్నింటిని భువనేశ్వర్-జగదల్‌పూర్ మధ్య తిరిగే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు జతచేసి తిప్పుతున్నారు. అసలిది ఎలా జరిగిందనే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
దాదాపు విశాఖవే..
రోజువారీ తిరిగే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు ప్రత్యేక రైలుగా భువనేశ్వర్ నుంచి ఇచ్ఛాపురం, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు తిరుగుతోంది. శుక్రవారం ఈ రైలును ప్రారంభించారు. పలువురు పరిశీలించినప్పుడు.. దానికున్న 12 కోచ్‌ల్లో దాదాపు 8-9 విశాఖ రైలుకు కేటాయించిన ఎల్‌హెచ్‌బీలే కనిపించాయి. సెకండ్‌సిట్టింగ్, స్లీపర్ కోచ్‌లపై అవి విశాఖ-అమృత్‌సర్ రైలుకు చెందినవనిగా... రైలు నంబరుతో సహా కనిపిస్తోంది. అలాగే ఏసీ కోచ్‌లపై ఉన్న రైలు నెంబర్లను రైల్వే అధికారులు తొలగించి పెయింట్ వేసినట్లు స్పష్టమవుతోంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు రెండు రేక్‌లుండగా, ఒక రేక్ (రైలు) శుక్రవారం, రెండోది శనివారం బయలుదేరాయి.
సంకల్పం నెరవేరింది...
హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లో నెల క్రితం ప్రయాణించి అందులోని ప్రయాణికులతో మాట్లాడాను. ‘రైలు చాలా శుభ్రంగా ఉంది. కానీ, కోచ్‌లు బాగోలేవు’ అన్నారు. అప్పుడే ఈ రైలుకు అత్యాధునిక కోచ్‌ల్ని ఏర్పాటు చేయాలని అనుకున్నా. అదిప్పుడు నెరవేరింది. - కొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన హిరాఖండ్ రైలును వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తూ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్న మాటలివి. ఈ కార్యక్రమం శుక్రవారం జరిగింది.
- రైల్వేమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఇటీవల భువనేశ్వర్, రాయగడ రైల్వేస్టేషన్ల పరిధిలో పర్యటించారు. అధికారులతో చర్చించిన తర్వాత భువనేశ్వర్-జగదల్‌పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు (08445/46) ను పూర్తి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిపేందుకు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఆదేశాలు అమలు చేసేందుకు తూర్పుకోస్తా అధికారులు సిద్ధమై... విశాఖకు వచ్చిన కొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల్ని హుటాహుటిన తీసుకెళ్లారు. శుక్రవారం భువనేశ్వర్‌లో ప్రారంభమైన హిరాఖండ్ రైలు బోగీల శ్రేణిలో ‘విశాఖ-అమృత్‌సర్’ రైలుకు కేటాయించిన కొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుండటం గమనార్హం.
మిగిలిన కోచ్‌లు ఏవీ...
విశాఖ-అమృత్‌సర్ (హిరాకుడ్) ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 18507/08. కొవిడ్ నేపథ్యంలో తాజాగా దాన్ని స్పెషల్‌రైలుగా శుక్రవారం నుంచి పట్టాలపైకి తేవడంతో రైలుకు 08503/04 నెంబరును తాత్కాలికంగా కేటాయించారు. తూర్పుకోస్తా అధికారులు సమాచారహక్కు చట్టం దరఖాస్తుకు ఇచ్చిన సమాధానం ప్రకారం.. ఈ రైలును వారానికి 3రోజుల నుంచి మరిన్ని రోజులకు పెంచే ప్రతిపాదన ఉంది. ఇలా చేయాలంటే అదనపు కోచ్‌లు అవసరం. ఇందుకుగాను 96 కోచ్‌ల్ని మంజూరుచేసినట్లు అధికారులు అందులో తెలిపారు. ప్రస్తుతం వాల్తేరుకు 38 కోచ్‌లు మాత్రమే ఇచ్చారు. మిగిలినవి ఏమయ్యాయనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ రైలు వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తోంది.
వాల్తేరు సమస్యపై దృష్టేది...
ఇప్పటికే తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల్నీ భువనేశ్వర్ తీసుకెళ్లారు. దాని స్థానంలో పాత కోచ్‌లే నడుస్తున్నాయి. అలాగే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీల నిర్వహణపైనా చాలా ఫిర్యాదులే వస్తున్నాయి. ఆయా కోచ్‌ల స్థానంలో కొత్త కోచ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మరోవైపు పాత కోచ్‌లతో విశాఖ నుంచి బయలుదేరే రైళ్లు ఆరేడున్నాయి. వీటన్నిటినీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా మార్చాల్సి ఉంది. ఇన్ని సమస్యలున్నా.. పూర్తి స్థాయిలో దృష్టిసారించకుండా వచ్చిన కొత్త కోచ్‌ల్ని భువనేశ్వర్‌కు తరలించడంపై రైల్వే నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నూతన కోచ్‌ల తరలింపు ప్రక్రియపై వాల్తేరు డివిజన్ అధికారుల్ని సంప్రదించినప్పుడు.. కొత్త కోచ్‌లన్నీ తూర్పుకోస్తా పేరుమీదే వస్తాయని, ఆ కోచ్‌ల్ని ఏ డివిజన్‌కు ఇవ్వాలనేది భువనేశ్వర్‌లోని రైల్వే అధికారులే నిర్ణయిస్తారని తెలిపారు. కోచ్‌ల్ని నిర్ణయించే అధికారం వాల్తేరు డివిజన్‌కు లేదన్నారు.
ఇదీ చూడండి: ఆ బామ్మ వయసు 60 కాదండోయ్.. పదహారే!