Vaccination Drive For Cervical Cancer By Minister: గర్భాశయ కేన్సర్‌ను నిరోధించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి విడదల రజిని అన్నారు. విశాఖపట్నం మహాత్మాగాంధీ కేన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం గర్భాశయ కేన్సర్ సుమారు 1.25 లక్షల మంది మహిళలకు సోకుతోందని, అందులో సుమారు 75వేల మంది వరకు చనిపోతున్నారని, ఇటువంటి మహామ్మారిని అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత రాష్ట్రప్రభుత్వం, ఏఏపీఐ వారి సహకారంతో గర్భాశయ కేన్సర్‌ను అరికట్టే చర్యలలో భాగంగా ఈ రోజు సుమారు 100 మంది 9నుంచి 14సంవత్సరాల వయస్సు గల విద్యార్ధులకు వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. తదుపరి రెండవ డోసును 6 నెలలు తరువాత వేస్తారని అన్నారు. వీటి విలువ సుమారు రూ 8000 వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే పేద విద్యార్ధులకు ఈ వ్యాక్సినేషన్ అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొదటిగా విద్యార్ధులకు వ్యాక్సిన్ వేసారు.
ఇవీ చదవండి