విశాఖపట్నంలో మద్యం సీసాలపై అధిక ధరలున్న స్టిక్కర్లు అతికిస్తున్న కొందరు అక్రమార్కులు.. కొనుగోలుదారులను మోసగిస్తున్నారు. నగరంలోని ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ దుకాణంపై దాడులు చేసిన పోలీసులు.. ఈ విషయం వాస్తవమే అని నిర్ధరించారు. రూ. 150 విలువైన జీ.సీ.గ్రీన్ ఛాయిస్ సుపీరియర్ విస్కీ బాటిల్‌పై 200 రూపాయల స్టిక్కర్‌ను అతికించారు. కొనుగోలుదారులు వాటి ధర పెరిగిందేమోనన్న ఉద్దేశంతో స్టిక్కర్ చూసి బాటిల్‌కు 50 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు.
ఇలా అధిక ధరలు ఉన్న 13 బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. సుమారు వంద వరకు స్టిక్కర్లు విడిగా ఉన్నట్లు తేల్చారు. మరో 33 మద్యం బాటిళ్లపై స్టిక్కర్లు పీకేసి ఉన్నట్లు నిర్ధరించారు. దుకాణ సూపర్‌వైజర్, సేల్స్‌మెన్ సీ.హెచ్.వేణుగోపాల్, మరో వ్యక్తి కలిసి ఈ అక్రమానికి పాల్పడినట్లు తేల్చారు. వారు ముగ్గురిని సెబ్ అధికారులకు అప్పగించగా కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
వీరికి ఆనందపురంలోని మద్యం డిపో-1లో విధులు నిర్వర్తిస్తున్న కృష్ణమూర్తి అనే డేటా ఎంట్రీ ఆపరేటర్ సహకరించారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అందుకుగానూ నెలకు 3 వేల చోప్పున వసూలు చేసేవాడని చెప్పారు. దీంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్టైన ఉద్యోగులను కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోడల్ ఈ.ఎస్. శ్రీనివాసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: